logo

గ్రానైట్‌ పరిశ్రమలపై గునపం

చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్‌ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం.

Published : 23 Apr 2024 04:51 IST

తాడిపత్రిలో 70 శాతం మూసివేత
రోడ్డున పడిన వేలాది కుటుంబాలు
ఇదీ జగన్‌ పాలనలో పరిస్థితి

పరిశ్రమ మూతపడటంతో నిరుపయోగంగా యంత్రాలు

చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్‌ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. 20 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తాం.

2019, మార్చిలో తాడిపత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ హామీ

తాడిపత్రి, న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వం పరిశ్రమలపై పగపట్టింది. హామీలను నెరవేర్చక పోగా ఇస్టానుసారం రాయల్టీ, విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో యజమానులు కుదేలవుతున్నారు. రాయలసీమలోనే తాడిపత్రి గ్రానైట్‌, నాపరాళ్ల పరిశ్రమలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో సజావుగా కొనసాగిన పరిశ్రమలు.. వైకాపా అధికారంలోకి రాగానే అన్నీ పెంచేసి..గునపం దించింది. నిర్వహణ భారమై, నష్టాలు భరించలేక 70 శాతం మంది యజమానులు తమ యూనిట్లను నిలిపివేశారు. మరికొందరు శాశ్వతంగా మూసేశారు. 2019కు ముందు తాడిపత్రిలో కళకళలాడిన పరిశ్రమలు వైకాపా ప్రభుత్వం విధానాలు శరాఘాతంగా మారాయి. రాయల్టీ పెంపు, విద్యుత్తు ఛార్జీల బాదుడు, ఎండీఎల్‌లు రద్దు, సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రయివేటు సంస్థకు అప్పగించడం.. తదితర కారణాలతో పరిశ్రమలు నడపడం సాధ్యం కాదని యజమానులు వాపోతున్నారు. ప్రత్యక్షంగా పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కూలీల కుటుంబాలకు పని లేకుండా పోయింది. లారీలు, చిన్న వాహనాల యజమానులు, వాటిని నడిపేవారికి ఉపాధి కరవైంది.

రాయల్టీ పెంపుతోనే..

తెదేపా హయాంలో 2,750 గ్రానైట్‌, నాపరాళ్ల పరిశ్రమలు నడిచేవి. ప్రత్యేక్షంగా, పరోక్షంగా 30 వేల మంది వాటిపై ఆధారపడి జీవించేవారు. అప్పట్లో విద్యుత్తు ఛార్జీలు తక్కువే ఉన్నప్పటికీ రూ.12 కోట్ల బిల్లులు చెల్లించేవారు. వైకాపా ప్రభుత్వంలో గ్రానైట్‌పై రాయల్టీ పెంచడంతో నిర్వహణ భారంగా మారింది. గతంలో రూ.2,300 ఉన్న రాయల్టీని రూ.3,500కు పెంచారు. ఒక్కో పరిశ్రమ నిర్వాహకుడికి నెలకు కనీసం రూ.60 వేలు అదనపు భారమైంది. విద్యుత్తు ఛార్జీలను యూనిట్‌కు రూ.3 చొప్పున పెంచేశారు. ఇంత పెంచినా ప్రస్తుతం రూ.2 కోట్లకు మించి బిల్లులు రావడం లేదు. అంటే ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. గతంతో ఒక్కో యూనిట్‌కు సగటున రూ.1.30 లక్షలు బిల్లు వచ్చేది. జగన్‌ ప్రభుత్వం పలుమార్లు ఛార్జీలు పెంచడంతో ఇప్పుడు రూ.1.80 లక్షలు వస్తోందని కొందరు యజమానులు వాపోయారు. విద్యుత్తును వినియోగించకపోయినా కనీస ఛార్జీ కింద ఒక్కో యూనిట్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఆదుకోవాల్సింది పోయి అధఃపాతాళానికి తొక్కారు

జగదీశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రానైట్‌ పరిశ్రమ యజమానుల సంఘం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను ఆదుకోవాల్సింది పోయి అట్టడుగుకు తొక్కేసింది. పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన జీవో వచ్చినప్పటికీ నాలుగేళ్లు గడుస్తున్నా అమలు కాలేదు. ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు. దీంతో పరిశ్రమలు మూతపడ్డాయి. రాయల్టీని పెంచి ఇప్పటికీ పరిశ్రమలపై ఆర్థిక భారం మోపుతున్నారు.

ఆరుగురికి ఉపాధి కల్పించేవాడిని..

మహమ్మద్‌, మెకానిక్‌

యంత్రాలకు మరమ్మతులు చేస్తూ జీవనం సాగించేవాడిని. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఆరుగురికి ఉపాధి కల్పించేవాడిని. ప్రస్తుతం నాకే ఉపాధి లేకుండా పోయింది. నెలలో నాలుగు రోజులు కూడా పని దొరకడం లేదు. చాలా మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలి.

కుటుంబ పోషణ భారమైంది

వీరన్న, కార్మికుడు

గ్రానైట్‌ పరిశ్రమలో పనిచేస్తూ కుంటుంబాన్ని పోషించుకునేవాడిని. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోల్పోతున్నాం. వారంలో ఒకటి రెండు రోజులే పని దొరుకుతోంది. మిగతా రోజుల్లో ఇతర పనులకు వెళితే రోజుకు రూ.300 మించి రావడం లేదు. పరిశ్రమలు బాగా నడిచే సమయంలో రోజూ రూ.1,000 పైగా సంపాదించేవాడిని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని