logo

అక్షరాలా మాట తప్పి.. నిస్సిగ్గుగా మడమ తిప్పి

మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్‌.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు.

Published : 03 May 2024 03:24 IST

కాగితాలకే పరిమితమైన ‘వీక్లీ ఆఫ్‌’
రక్షకభటులకు మొండిచేయి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్‌.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. అలవి కాని హామీలిచ్చి మొండి చేయి చూపాడు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు వారాంతపు సెలవు అమలు పరుస్తామని హామీ ఇచ్చాడు. వైకాపా అధికారం చేపట్టాక ప్రారంభంలో కొన్ని నెలలపాటు అరకొరగా అమలు పరిచి.. తర్వాత పూర్తిగా ‘వీక్లీ ఆఫ్‌’కు మంగళం పాడారు.

అవస్థలు చూడలేదు..

అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో, పండగ వేళల్లో పోలీసులు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఏఎస్సైల నుంచి కానిస్టేబుల్‌ దాకా ఉంది. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు వీక్లీ ఆఫ్‌ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. స్టేషనులోని మొత్తం సిబ్బందిలో ప్రతి 7 మందిలో ఒకరికి చొప్పున ప్రతిరోజూ సెలవు. ‘పోలీసులకు ‘వీక్లీ ఆఫ్‌’ ప్రకటిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం’.. అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ఉత్తర్వులకు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా క్షేత్రస్థాయిలో అతీగతీ లేదు. ప్రస్తుతం ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. సిబ్బంది తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. శాంతి భద్రతలు, ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌.. ఇలా అన్ని ప్రధాన విధులు నిర్వర్తించాల్సి ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది తీవ్రం

‘‘మేమూ అందరిలాంటి మనుషులమే.. మాకూ కుటుంబం, పిల్లలు ఉంటారు. ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా, అత్యవసర సమయాల్లో సైతం సెలవు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ సెలవు దొరికినా గంటల వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి చేరుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వారంలో ఒకరోజు సెలవు లేకపోతే ఎలా? ప్రభుత్వం ప్రకటించిన ‘వీక్లీ ఆఫ్‌’ ఏమైందో తెలియదు. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నచోట.. స్టేషన్‌ అధికారి దయపైనే వారాంతపు సెలవు ఆధారపడి ఉంటోంది. మామూలు పరిస్థితుల్లో సైతం వారాంతపు సెలవు దొరకడం గగనమవుతోంది’ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కానిస్టేబుల్‌ ఆవేదన ఇది.

3,170 మంది సెలవుకు దూరం

ఉమ్మడి జిల్లాలో 3,300 పైగా పోలీసులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. ఎస్పీ సహా ,నలుగురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 52 మంది సీఐలు , 149 ఎస్సైలు ఉన్నారు. వీరిలో వారాంతపు సెలవులకు అర్హులుగా 225 మంది ఏఎస్సైలు, 565 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 1,600 మంది కానిస్టేబుళ్లు, 780 మందికి పైగా ఏఆర్‌ సిబ్బంది ఉన్నారు. సున్నితమైన జిల్లా కావడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. కొవిడ్‌ విధుల్లో ఉమ్మడి జిల్లాలో 818 మంది పోలీసులు కరోనా బారిన పడగా, అందులో 9 మంది మృతి చెందారు. విధుల్లో ఉన్నవారికి వేళకు తిండి, నిద్ర ఉండటం లేదు. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. చాలా మంది చక్కెర వ్యాధి, గుండె జబ్బులు, మూత్రపిండాలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. నిరంతర డ్యూటీలతో సమయానికి సెలవులు లేక, కుటుంబాలకు దూరంగా ఉండలేక మానసికంగా కుంగిపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని