logo

ఎన్నికల ముందు అధికారిక తాయిలాలు

ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్‌ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది.

Published : 07 May 2024 05:10 IST

ఒకేరోజు రూ.36 కోట్లు ‘ఉపాధి’ బిల్లులు విడుదల
వైకాపా ప్రభుత్వం కుయుక్తులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్‌ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది. ఒకే రోజు ఉమ్మడి జిల్లాలో రూ.36 కోట్లు ఉపాధి హమీ పథకం బిల్లుల్ని ఖాతాల్లో జమ చేసింది. రెండు రోజుల్లో మరో రూ.50 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు అప్‌లోడ్‌ చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద పనులు చేసిన వారిలో వైకాపా సర్పంచులు, నాయకులే ఉన్నారు. ఎన్నికల సమయంలో వారికి పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించడం ద్వారా ఓటర్లకు తాయిలాల పంపిణీ మరింత సులభమవుతుందని వైకాపా పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకోసమే హడావుడిగా బిల్లుల్ని చెల్లిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉపాధి పథకం పంచాయతీల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద పనులు చేపడతారు. సీసీ రోడ్లు, సచివాలయ భవనాలతో పాటు పండ్ల తోటల పెంపకం వంటివి నిర్వహిస్తారు. వీటికి సంబంధించి 2022-23 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంతకాలం బిల్లులపై స్పందించని జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో వైకాపా తరఫున డబ్బులు పంపిణీ చేయడం కోసమే బిల్లులు చెల్లిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

పనిచేయరనే భయంతో..

గత ఐదేళ్లలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపుపై జగన్‌ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. కేంద్రం విడుదల చేసిన నిధుల్ని అవసరాలకు వాడుకుని తర్వాత ఎప్పుడో చెల్లించేవారు. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్ని పూర్తిస్థాయిలో దారి మళ్లించడంతో వైకాపా సర్పంచులు సైతం అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులకు జమ చేసుకుంది. ఇతర పథకాలకు నిధుల్ని మళ్లించి పంచాయతీలకు మొండిచేయి చూపుతూ వచ్చింది. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.300 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారు. బిల్లులు రాక అప్పుల పాలై గ్రామాలను వదిలేసిన వైకాపా సర్పంచులు ఉమ్మడి జిల్లాలో చాలామంది ఉన్నారు. ఇంతకాలం సర్పంచులను, స్థానిక నాయకుల్ని గాలికొదిలేయడంతో వారంతా ఎన్నికల్లో పనిచేయబోమంటూ తేల్చి చెబుతున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి బిల్లులకు ఆఘమేఘాలపై ఆమోదం తెలిపి ఖాతాల్లో జమ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని