logo

భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!

‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది.

Published : 19 Apr 2024 03:34 IST

ఉద్యోగుల కొరతతో ఉన్నవారిపైనే అదనపు భారం
రిటైర్‌మెంట్‌ వయసులో పని ఒత్తిడి

మెగా డీఎస్సీ విడుదల చేయాలని తిరుపతిలో ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులు ( పాతచిత్రం)

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. అయ్యగారు అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచినా ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల చావులు చూస్తున్నారు. మరోపైపు పోస్టులు భర్తీ చేయకపోవడంతో అధిక పనిభారం పడుతూ ఉన్న ఉద్యోగులు ఆసుపత్రులపాలవుతున్నారు.

ఖాళీలిన్ని.. మరీ భర్తీలేవీ?

ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచి, వారితో అదనపు పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఖాజానా ఖాళీ కాకుండా ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు చేసే పనులు ఒక్కరే చేయాలని పైస్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మావల్లకాదు అంటే బెదిరించి పనులు చేయించుకుంటూ పోతున్నారు. జిల్లాలోని తితిదే మొదలుకొని అన్ని విభాగాల్లో సుమారు 22 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం.


  • ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే జాబ్‌చార్ట్‌తో స్పష్టత ఉండేది. నేడు అవేవీ పట్టించుకోవట్లేదు. శాఖల్లో సిబ్బంది కొరత నెలకొనడంతో సమస్యల పరిష్కారం సకాలంలో కనిపించడం లేదు. బోధనలో నిమగ్నం కావాల్సిన ఉపాధ్యాయులకు లెక్కకు మిక్కిలి పనులు అప్పగిస్తున్నారు. పోస్టులు రద్దుచేసి రోజుకొక పాఠశాలకు పంపుతున్నారు. మధ్యాహ్న భోజన వివరాలు, నాడు-నేడు పనుల పర్యవేక్షణ, విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు వేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. దానికితోడు నిర్ణీత కాలంలో సిలబస్‌ పూర్తిచేయాలని ఒత్తిళ్లు. ఎప్పటికప్పుడు మారిపోయే సిలబస్‌ సరేసరి.

  • ఆర్టీసీలో పనిభారంతో సిబ్బంది సతమతమవుతున్నారు. వారి విధులు మరింత కష్టతరమైనవి కాగా సరైన విశ్రాంతి లేకపోవడం, కుటుంబ సమస్యలు, పనిఒత్తిడి, నాణ్యమైన వైద్యం అందకపోవడం, ప్రభుత్వ ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో గుండెపోటు మరణాలు పెరిగినట్లు ఉద్యోగులు వాపోతున్నారు.

దస్త్రాలు కదలడం లేదు
- బాలాజీ, ఆపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

జగన్‌మోహన్‌రెడ్డి మఖ్యమంత్రి అయిన తరవాత ఖాళీల భర్తీని అటకెక్కించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో చాలావరకు దస్త్రాలు కదలడం లేదు. దాంతో ఇతర ఉద్యోగులపై ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధిక ఖాళీలు తోడు ప్రభుత్వం చెప్పే నాడు-నేడు, యాప్‌ల ఆప్‌లోడ్‌ వంటి పనులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు.


జీవో 117నే కారణం
- సాంబిరెడ్డి, ఉపాధ్యాయుడు, తిరుపతి

జీవో 117 అమలుతో పాఠశాలల విలీనం చేశారు. అంతకుముందు ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల చేత బోధన జరిగేది. గణితం, సామాన్య, సాంఘిక, హిందీ సబ్జెక్టు నిపుణుల బోధనలో నాణ్యత కనిపించేది. నేడు సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులే బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులు సైతం తగ్గించారు. విద్యార్థుల నిష్పత్తికనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి.


ఖాళీలు కనిపించడం లేదా?
- జయచంద్ర డీవైఎఫ్‌ఐ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే మడమ తిప్పారు. ఖాళీలను భర్తీ చేయకుండా యువత ఆశలు విచ్ఛిన్నం చేశారు. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని మాయమాటలు చెప్పారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన బుద్ధిచెబుతారు. హామీలను నెరవేర్చేవారికే యువత మద్దతు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని