నీడనిచ్చి... వెలుగులు నింపి!

‘నాకు నీడలేదు... నా అన్నవాళ్లు లేరు..’  ఈ మాటలు ఎవరి నోటా వినకూడదనుకున్నారు... డాక్టర్‌ గీత, థామస్‌రెడ్డిలు. వాళ్లది ఒకటే ఆలోచన, ఒకటే ఆశయం.. అదే సేవాపథం.

Updated : 10 Jun 2024 06:59 IST

‘నాకు నీడలేదు... నా అన్నవాళ్లు లేరు..’  ఈ మాటలు ఎవరి నోటా వినకూడదనుకున్నారు... డాక్టర్‌ గీత, థామస్‌రెడ్డిలు. వాళ్లది ఒకటే ఆలోచన, ఒకటే ఆశయం.. అదే సేవాపథం. 23 ఏళ్లుగా లక్షల మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వీరు... మనకీ సేవామార్గంలో నడిచే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవాయజ్ఞంవైపు ఎందుకు అడుగులు వేశారో డాక్టర్‌ గీత మనతో పంచుకున్నారు...

చిన్నప్పటి జ్ఞాపకాలు మనసులో చెరగని ముద్రవేస్తాయి కదా! అలాంటి ఒక జ్ఞాపకమే నన్ను సేవవైపు నడిపించింది. మాది కర్నూలు. నాన్న బాలరెడ్డి సైనికోద్యోగి. అమ్మ ఆనందమ్మ. దేశానికి సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని నమ్మేవారు నాన్న. ఆయన ఆలోచనలు నన్నూ ప్రభావితం చేశాయి. నేను చదివే స్కూల్లో మమ్మల్ని దగ్గర్లోని గ్రామాలకు తీసుకెళ్లేవారు. అలా ఓసారి మారుమూల గ్రామానికి వెళ్లినప్పుడు ఓ పూరిగుడిసెలో నాకంటే చిన్నగా ఉన్న ఓ అమ్మాయి ఒక్కతే జ్వరంతో ఏడవడం చూశా. నేనూ, నా ఫ్రెండ్స్‌ ఆ పాపకి నయమయ్యేంతవరకూ ఉండి, తోచిన సాయం చేశాం. కాస్త కోలుకున్నాక... మా అమ్మానాన్నలు కూలికి వెళ్లారని చెప్పిందా పాప. గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి, వైద్య సదుపాయాల లేమి ఆ వయసులో నన్ను చాలా బాధపెట్టాయి. పెద్దయ్యాక డాక్టరవ్వాలని, ఇలాంటి పేదల కష్టాలు తీర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. బెంగళూరులో ఎంబీబీఎస్‌ చదువుతున్న సమయంలో మదర్‌థెరిసాతో మాట్లాడే అవకాశం వచ్చింది. ‘పదిమందికి సేవలందించడంలోనే సంతృప్తిని వెతుక్కోవాలని’ అన్న ఆమె మాటలు మనసులో అస్పష్టంగా ఉన్న నా లక్ష్యాన్ని సంకల్పంగా మార్చాయి. పదిహేడేళ్ల వయసులోనే స్నేహితులతో కలిసి చందాలేసుకుని మా పరిసర గ్రామాల్లోని పేద పిల్లలకు పుస్తకాలు అందించేదాన్ని. మెడిసిన్‌ అవ్వగానే పేదలకు వైద్యసేవలందించడం మొదలుపెట్టా. అప్పుడే థామస్‌రెడ్డి చిత్తా నాకు పరిచయమయ్యారు. అప్పటికే ఆయన సేవామార్గంలో ఉన్నారు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే కావడంతో 2002లో పోరుమామిళ్లలో ‘ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ (ఎఫ్‌సీఎన్‌)’ అనే సంస్థని స్థాపించాం. అప్పటికి మాకు వివాహం కాలేదు. కానీ ఒక్కటైతే... ఇంకా ఎక్కువమందికి సేవ చేయొచ్చని భావించి పెళ్లి చేసుకున్నాం. చిన్నారులు, అనాథలు, దివ్యాంగులు, వృద్ధులూ ఇలా ఎవరూ లేని అభాగ్యులను అక్కున చేర్చుకున్నాం. వాళ్లలో చిన్నారులకు మంచి చదువునిస్తే వారి జీవితాలు బాగుపడతాయని ఓ పాఠశాలను స్థాపించి ఆ ఖర్చంతా మేమే చూసుకునేవాళ్లం. ఆ పిల్లలకు ఏటా 40 వేల పుస్తకాలు, 1500 స్కూల్‌ బ్యాగులతోపాటు పాఠశాలలో గ్రంథాలయాన్నీ  నిర్వహించేవాళ్లం.

ఉచితంగా శస్త్రచికిత్సలు..

వైకల్యంతో బాధపడుతున్న ఓ పెద్దాయన్ని తీసుకొచ్చాడు వాళ్ల అబ్బాయి. తనకే పూట గడవడం కష్టంగా ఉందనీ, తండ్రిని చూసుకొనే ఓపిక లేదని చెప్పినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతవరకూ చిన్నారులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన మేం పెద్దలకోసం 2019లో హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో ఆరున్నరెకరాల స్థలంలో ‘ఎఫ్‌సీఎన్‌ హోం’ని స్థాపించాం. పెద్దవాళ్లు మాకెవరూ లేరు అనే చింతతో కాలం వెళ్లదీయకుండా... చుట్టూ ఉన్నవాళ్లంతా మనవాళ్లే అనే ధైర్యంతో బతికేట్టు ఆ సంస్థని తీర్చిదిద్దాం. ప్రస్తుతం మా సంస్థలో 50 మందికిపైగా పెద్దవాళ్లు ఉన్నారు. ఇక్కడి వరకూ రాలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్థికసాయం చేస్తున్నాం. హైస్కూల్, కళాశాల చదివే ఆడపిల్లల్లో లేడీస్‌ హెల్త్‌ పేరిట పుస్తకాలతో లైంగిక విజ్ఞానం అందజేస్తున్నాం. ఒంటరి మహిళలకు శిక్షణనిచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తూ, వాళ్లు స్వతంత్రంగా ఉండేలా చేస్తున్నాం. ముఖ్యంగా గ్రహణం మొర్రి, గ్రహణశూల బాధితులకు ప్రతి నెలా క్యాంపులు నిర్వహించి జీఎస్‌ఆర్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. ఇప్పటి వరకూ 2,000 మందికి ఈ శస్త్రచికిత్సలు నిర్వహించాం. ఈ వ్యాధి బాధితులెవరైనా 90000 77410 ఈ నెంబరును సంప్రదిస్తే మా వంతు సాయం అందిస్తాం.


మీరూ చేయొచ్చు...

మేం అమెరికాలో ఆరునెలలు, ఇక్కడ ఆరునెలలు ఉంటాం. అక్కడా సేవ చేస్తున్నాం. దాతలు, అమెరికాలో ఉంటున్న స్నేహితుల సాయంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలామందికి సేవ చేయాలని ఉంటుంది. కానీ అందుకు సరైన వేదిక కనిపించదు. మీరూ ఒక పేదింటి అమ్మాయిని చదివించాలనిపిస్తే మా వెబ్‌సైట్‌ www.-f-cn-india.org ద్వారా ఆ పనిచేయొచ్చు. ఇలా ఎన్నో వేలమంది పిల్లలు ఉపకారవేతనాలూ, ఆర్థిక సాయం అందుకుంటున్నారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎన్జీవో అవార్డుని అందుకున్నాం. గత ఏడాది ‘విశిష్ట సేవా’ పురస్కారం అందుకున్నా. జీవితమంతా ఇలా సేవలో గడిపేయాలన్నదే మా లక్ష్యం.

 వేల్పూరి వీరగంగాధర శర్మ, పిడుగురాళ్ల 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్