logo

ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు

ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు.

Published : 17 May 2024 05:36 IST

పెరవలి మండలం ఖండవల్లిలో నేలకొరిగిన అరటితోటలు

ఉండ్రాజవరం, పెరవలి, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని లంకభూముల్లో సారవంతమైన నేలల్లో వీటిని పండిస్తారు. సుమారు 30 వేల ఎకరాల్లో కూర అరటి, కర్పూర, చక్కెరకేళీ, బొంత, అమృతపాణి తదితర రకాలు సాగవుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలకు గెలలు పడిపోవడం, చెట్లు వాలిపోవడంతో రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. ఎకరానికి సుమారు 750 పిలకలు (విత్తనం) నాటితే 10 నెలలకు పంట వస్తుంది. ఇందుకోసం ఎకరానికి రూ.90 వేలు అవుతుంది. చెట్లు పడిపోకుండా వెదురు కడతారు. చెట్టుకు రూ.120 చొప్పున ఖర్చు చేస్తారు. మొత్తంగా ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. గెల ఒక్కదానికి రూ.130 పెట్టుబడి అవుతోంది. ప్రస్తుతం టోకు ధర రూ.100 నుంచి రూ.110గా ఉంది. ఓపక్క సరైన ధర లేకపోవడం, మరోపక్క చెట్లు పడిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.


రూ.3 లక్షలు పెట్టాను..

రెండు ఎకరాల్లో కర్పూర అరటి సాగు చేస్తున్నా. రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. సరిగ్గా నెలరోజులు దాటితే పంట చేతికొచ్చేది. ఇంతలో ఈదురుగాలులు రావడంతో చెట్లు పడిపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు.

భూపతిరాజు వెంకటసూర్యనారాయణరాజు, ఖండవల్లి


తీవ్రనష్టం

రెండు ఎకరాల్లో కూర అరటి పండిస్తున్నా. వారంలో గెలలు దించుదామని అనుకున్నాం. ఇంతలో వర్షానికి పంట దెబ్బతింది. ఇప్పుడు పెట్టుబడి కూడా వస్తుందో రాదో తెలియదు.

కరుటూరి సుబ్బారావు, తీపర్రు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు