logo

ఇక లారీలన్నీ పట్టణానికి వెలుపలే...

జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులో ఇక రోడ్ల వారగా భారీ వాహనాల నిలిపివేత సమస్య వైదొలగనుంది. ఈ పరిణామం వచ్చి పోయే వాహనదారులకు, పట్టణ వాసులకు ఎంతో ఊరట నిచ్చే అంశం..

Published : 06 Jul 2022 02:17 IST

తగ్గనున్న ట్రాఫిక్‌ సమస్య ● పార్కింగ్‌కు 12 ఎకరాల స్థలం కేటాయింపు

న్యూస్‌టుడే, తాండూరు


తాండూరులో ప్రధాన రహదారి వారగా నిలిచిన వాహనాలు

జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులో ఇక రోడ్ల వారగా భారీ వాహనాల నిలిపివేత సమస్య వైదొలగనుంది. ఈ పరిణామం వచ్చి పోయే వాహనదారులకు, పట్టణ వాసులకు ఎంతో ఊరట నిచ్చే అంశం.. స్థానికంగా అవసరాలకు తగ్గట్టు లారీ పార్కింగ్‌ లేక పోవడంతో వివిధ రాష్ట్రాల నుంచి తాండూరుకు వచ్చి పోయే వాహనాలను చోదకులు ప్రధాన రహదారులకు ఇరు వైపులా నిలిపివేస్తున్నారు. దీంతో ఎదురు నుంచి వేగంగా వస్తున్న వాహనాలను నిలిచి ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో చాలా మంది గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పట్టణానికి వెలుపల 12 ఎకరాల్లో ‘లారీ పార్కింగ్‌’ ఏర్పాటు చేయడానికి నిర్ణయించి స్థలాన్ని కేటాయించింది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

రద్దీ ఎందుకంటే..

తాండూరు పట్టణానికి సమీపంలోనే ఐదు సిమెంటు కర్మాగారాలు, వందల కొద్దీ నాపరాళ్లు, సుద్ద, లేటరైట్‌ గనులున్నాయి. 800కు పైగా నాపరాళ్ల పరిశ్రమలు ఉన్నాయి. సిమెంటు కర్మాగారాలకు ముడిసరకు లారీల్లోనే వస్తుంది. ఉత్పత్తులు కూడా వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలుతాయి. అలాగే ముడి నాపరాయి, నునుపు నాపరాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు నిత్యం వందల కొద్దీ లారీల్లో ఎగుమతి జరుగుతోంది. గుజరాత్‌, కాకినాడకు సుద్ద ఎగుమతి సాగుతోంది. వీటికి తోడు ముంబయి, బెంగళూరు జాతీయ రహదారులకు తాండూరు పట్టణం కూడలిగా ఉంది.

* అన్ని రకాల భారీ వాహనాలు కలిపి నిత్యం 5000కు పైగా తాండూరు పట్టణం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. భారీ వాహనాలను చోదకులు ప్రధాన రహదారుల వారగా నిలువరిస్తున్నారు. తాండూరు-సంగారెడ్డి, తాండూరు- కొడంగల్‌, తాండూరు- చించోళి, తాండూరు-హైదరాబాద్‌, తాండూరు-కరణ్‌కోట వంటి ప్రధాన రహదారులకు ఇరువైపులా వందల కొద్దీ వాహనాలు ఆగుతున్నాయి. అన్ని వాహనాలను నిలపడానికి పట్టణంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలం సరి పోవడం లేదు. దీంతో చేసేది లేక చోదకులు ఎక్కడబడితే అక్కడే ఆపుతున్నారు. ఫలితంగా రహదారులు కుచించుకు పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిస్థితిని చక్క దిద్దడానికి పట్టణానికి దూరంగా ప్రభుత్వం 12 ఎకరాల్లో లారీ పార్కింగ్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఆమేరకు తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 58లోని 15 ఎకరాల్లో 12 ఎకరాలను కేటాయించింది. ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌ చెల్లించనుంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో లారీ పార్కింగ్‌ ఏర్పాటైతే ప్రధాన రహదారుల వారగా నిలిపే వాహనాల రద్దీ తగ్గిపోయి వచ్చి పోయే వాహనాల రాకపోకలు సౌకర్యంగా జరుగుతాయి. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.

ఆటో నగర్‌ అక్కడే

లారీ పార్కింగ్‌ ఏర్పాటు చేసే స్థలానికి సమీపంలోనే 3 ఎకరాలను ప్రభుత్వం ఆటో నగర్‌కు కేటాయించింది. దీంతో పట్టణంలో ఉన్న వాహనాల మరమ్మతు కేంద్రాలు, విడి భాగాల విక్రయ దుకాణాలు అక్కడికే తరలుతాయి. ఈ పరిణామంతో పట్టణంలో నిలిచే వాహనాల రద్దీ మరింత తగ్గుతుంది. ప్రస్తుతం పట్టణంలోని వివిధ రకాల వాహనాల మరమ్మతు కేంద్రాలు, విడి భాగాల దుకాణాల వద్ద అడ్డదిడ్డంగా వానాలు ఆగుతున్నాయి. ఇది ఒకరకంగా ఇబ్బందిగా ఉంటోంది. ఆటోనగర్‌ ఏర్పాటుతో విడిభాగాల విక్రయ దుకాణాలు కూడా అక్కడికే తరలుతాయి. వాహనాలు నిలిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఇన్నాళ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారమౌతుంది. కాలుష్యం కూడా తగ్గుతుందని స్థానికులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని