logo

Hyderabad: ఉస్మానియాలో డాక్టర్లుగా ట్రాన్స్‌జెండర్లు

‘ఇక్కడ వరకు వచ్చేందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం.. అవన్నీ దిగమింగి చివరికి అనుకున్నది సాధించాం.. పేదలకు సేవ చేసే భాగ్యం దక్కింది. దీన్ని ఒక అవకాశంగా భావించి సత్తా చాటుతాం’ అంటున్నారు

Updated : 30 Nov 2022 09:32 IST

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ‘ఇక్కడ వరకు వచ్చేందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం.. అవన్నీ దిగమింగి చివరికి అనుకున్నది సాధించాం.. పేదలకు సేవ చేసే భాగ్యం దక్కింది. దీన్ని ఒక అవకాశంగా భావించి సత్తా చాటుతాం’ అంటున్నారు ట్రాన్స్‌జెండర్‌ వైద్యులు ప్రాచి రాథోడ్‌, రుత్‌జాన్‌పాల్‌. వీరిద్దరూ ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్‌ ఆఫీసర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో చేరారు. మంగళవారం ఈ ఇద్దరు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని యాంటి రెట్రోవైరల్‌ విభాగంలో వైద్యులుగా సేవలందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ అవకాశం తమ వర్గానికి దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్‌ జాన్‌పాల్‌ 2018లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత నగరంలోని 15 ఆసుపత్రుల్లో వైద్యురాలిగా పనిచేసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరికి 2021లో నారాయణగూడలో తన స్నేహితురాలు డాక్టర్‌ ప్రాచీతో కలిసి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. ‘ప్రస్తుతం ఈ క్లినిక్‌ చక్కగా నడుస్తోంది. ఇంతలోనే ఉస్మానియాలో వైద్యులుగా అవకాశం వచ్చింది.’ అని ఆమె అన్నారు.

* ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఎంబీబీస్‌, ఎమర్జెన్సీ మెడిసిస్‌ పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్‌ ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో 3 ఏళ్లు పనిచేశారు. జెండర్‌ విషయం అక్కడ తెలియడంతో ఉద్యోగం మాన్పించారు అని డాక్టర్‌ ప్రాచీ తెలిపారు. తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్లకు వైద్యులుగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని ఉస్మానియా సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని