logo

ఓ పావురమా.. రోగాలు ఆపడం మా తరమా

పావురాలకు తరచూ మేత వేస్తూ.. అక్కడే సెల్ఫీలు దిగుతూ గంటల తరబడి గడిపేస్తున్నారా? అయితే మీరు ప్రమాదం అంచున ఉన్నట్లే. పావురాల కోసం ఇంట్లో గూడుకట్టి వాటిని చూస్తూ మురిసిపోతున్నారా..

Updated : 05 Dec 2022 06:07 IST

డా.సందీప్‌ అత్తావర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పావురాలకు తరచూ మేత వేస్తూ.. అక్కడే సెల్ఫీలు దిగుతూ గంటల తరబడి గడిపేస్తున్నారా? అయితే మీరు ప్రమాదం అంచున ఉన్నట్లే. పావురాల కోసం ఇంట్లో గూడుకట్టి వాటిని చూస్తూ మురిసిపోతున్నారా.. ఇది కూడా ప్రమాదమే. అవి నివాసం ఉన్న చోట భారీ ఎత్తున రెట్టలు వేయడం.. వాటి ఈకలు రాల్చడం చేస్తుంటాయి. పక్షులపై ఉన్న ప్రేమ.. భూత దయతో చాలామంది వాటిని శుభ్రం చేస్తుంటారు. కొందరైతే బాల్కనీలో వాటి కోసం ప్రత్యేకంగా గూడు ఏర్పాటు చేసి మేత పెట్టి అక్కడ గుడ్లు, పిల్లలు పెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా చేయడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పావురాల వల్ల ప్రమాదకర ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్‌ సొసైటీ ఫర్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(ఐఎన్‌ఎస్‌హెచ్‌ఎల్‌టీ) సదస్సు అనంతరం ప్రముఖ ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు, ఐఎన్‌ఎస్‌హెచ్‌ఎల్‌టీ అధ్యక్షులు డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ ప్రత్యేకంగా ‘ఈనాడు’తో మాట్లాడారు. ఏమన్నారంటే..

‘పావురాలతో గడిపే వారిలో కొందరు తీవ్రమైన హైపర్‌ సెన్సిటివిటీ న్యూమోనైటిస్‌(హెచ్‌పీ) ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. ఎవరికి ఈ సమస్య వస్తుందనేది కచ్చితంగా చెప్పలేం. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులు ఉంటే త్వరగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పావురాలు విసర్జించే రెట్టలో కొన్ని ఫంగల్‌, బ్యాక్టీరియా, వైరస్‌లు ఈ వ్యాధికి హేతువు. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల కణజాలం వాపునకు గురవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టం. కొద్ది దూరం నడిస్తే అలసిపోతుంటారు. క్రమేపీ బరువు తగ్గుతారు. ఔషధాలతో కొంత వరకు నియంత్రించవచ్చు. కొందరిలో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని చివరికి మార్పిడి వరకు దారి తీస్తుంది’ అని వివరించారు. వీలైనంత వరకు పావురాలకు దూరం ఉండాలని సూచించారు.
గతంలో జయశంకర్‌ యూనివర్సిటీలో జరిపిన అధ్యయనంలో నగరంలో కపోతాల అడ్డాలు 500పైనే ఉన్నట్లు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని