logo

5 హత్యలు.. ఆరుగురికి కత్తిపోట్లు.. వణికిన రాజధాని

మహానగరం బుధవారం వరుస హత్యలతో వణికిపోయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేవలం 15 గంటల వ్యవధిలో అయిదు హత్యలు, ఆరుగురికి కత్తిపోట్ల ఘటనలు కలకలం సృష్టించాయి.

Published : 22 Jun 2023 02:48 IST

ఒకేరోజు 15 గంటల వ్యవధిలో వేర్వేరు ఘటనలు
న్యూస్‌టుడే, కార్వాన్‌, కాటేదాన్‌, చాదర్‌ఘాట్‌

మహానగరం బుధవారం వరుస హత్యలతో వణికిపోయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేవలం 15 గంటల వ్యవధిలో అయిదు హత్యలు, ఆరుగురికి కత్తిపోట్ల ఘటనలు కలకలం సృష్టించాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండే గ్రేటర్‌ పోలీసులకు సవాల్‌ విసిరాయి. హత్యకు గురైన వారిలో ఇద్దరేసి హిజ్రాలు, వలస  జీవులు, ఒకరు ఆటోడ్రైవర్‌ ఉన్నారు. పెళ్లికి నిరాకరించినందుకు నార్సింగిలో పల్నాడుకు చెందిన ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ సమీపంలో మందుబాబుల వీరంగంతో అయిదుగురు కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


బైక్‌పై వచ్చి కత్తితో పొడిచి..

మీర్‌చౌక్‌ కాలికబర్‌ ప్రాంతానికి చెందిన యూసుఫ్‌(30) ఆటో డ్రైవర్‌. అదే ప్రాంతానికి చెందిన అక్రమ్‌ కారు డ్రైవింగ్‌ స్కూల్‌ నడిపిస్తున్నాడు. వీరు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం యూసుఫ్‌ మీర్‌చౌక్‌ నుంచి ఆజంపురా వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫిర్‌దౌస్‌ హోటల్‌ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన అక్రమ్‌(30) అతని స్నేహితుడు సోహెబ్‌(30) యూసుఫ్‌ను కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిపుణుల బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో మీర్‌చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో అక్రమ్‌కు, యూసుఫ్‌ భార్యకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న యూసుఫ్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారమే హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ప్రేమను తిరస్కరించిందని..

పుప్పాలగూడలో ప్రేమోన్మాది ఘాతుకం

గణేశ్‌

నార్సింగి, న్యూస్‌టుడే: తన ప్రేమను ఒప్పుకోమని కొన్నేళ్లుగా వెంటపడుతున్నాడు. ఆమె తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్సై అనిల్‌కుమార్‌ వివరాల ప్రకారం.. ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతి(22) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన ఆమె బంధువు కొత్త గణేశ్‌(27) జొమాటోలో డెలివరీ బోయ్‌గా పనిచేస్తూ గచ్చిబౌలి ఇందిరానగర్‌ రోడ్డు నెం.2లోని హాస్టల్‌లో ఉంటున్నాడు. గణేశ్‌ పదేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నా ఆమె తిరస్కరిస్తోంది. యువతి తల్లిదండ్రులు కూడా పెళ్లికి నిరాకరించారు. ఆమె మనసులో వేరే ఎవరో ఉండటం వల్లే తనను వద్దంటోందని భావించి అనుమానం, పగ పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి మొక్కలు నరికే కత్తిని బ్యాగులో పెట్టుకుని యువతి ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. మాట్లాడాలంటూ ఆమెను బైక్‌పై ఎక్కించుకుని టిగ్రిల్‌ హోటల్‌ వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడ వాగ్వాదం జరగడంతో కత్తిని ఆమె గొంతుపై పెట్టి బెదిరించాడు. అడ్డుకునే యత్నంలో ఆమె చెంప, గొంతు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే గణేశ్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి తెలపడంతో గచ్చిబౌలి ప్యాట్రోలింగ్‌ పోలీసులు వచ్చి నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి బాధితురాలిని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించి, నిందితుడిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి రిమాండ్‌కు తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదన్నారు.


బండరాయితో మోది..

హత్యకు గురైన ప్రకాష్‌, మతి స్థిమితంలేని వ్యక్తి

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. గంజాయి మత్తులో ఉన్న ఉన్మాది దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మధు కథనం ప్రకారం. మత్తులో తూలుతూ గుర్తుతెలియని వ్యక్తి(35) పాత కర్నూలు రహదారి నుంచి దుర్గానగర్‌ చౌరస్తాకు చేరుకున్నాడు. అదే ప్రాంతంలోని రంగుల దుకాణం వద్ద మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్‌(50) పగలంతా దుప్పట్లు అమ్ముకుని రాత్రిపూట ఫుట్‌పాత్‌పై నిద్రపోతుంటాడు. అక్కడికెళ్లిన నిందితుడు అరగంట సేపు అతని పక్కనే నిద్రపోతున్నట్లు నటించాడు. ప్రకాష్‌ను నిద్రలేపి డబ్బు ఇవ్వమంటూ బెదిరించాడు. పిచ్చివాడిగా భావించిన అతడు కొంత డబ్బు ఇచ్చి తిరిగి నిద్రపోయాడు. ఇంకా డబ్బులున్నాయని భావించి బండరాయితో తలపై మోదాడు. అతడు మరణించినట్టు గుర్తించాక డబ్బు తీసుకొని పారిపోయాడు. అదే అగంతకుడు కాటేదాన్‌ స్వప్న టాకీస్‌ పక్కనే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మతిస్థిమితంలేని వ్యక్తి(40)ని ఇదే తరహాలో హతమార్చాడు. మృతుడు చాలాకాలం క్రితం వలస వచ్చాడని మతిస్థిమితం లేకున్నా చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. భిక్షాటన చేసేవారిని నిందితుడు బెదిరిస్తూ డబ్బులు గుంజుకుంటాడని స్థానికులు పేర్కొన్నారు.


ఇద్దరు హిజ్రాలు...

టప్పాచబుత్రలోని కిషన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్లు రియాజ్‌ అలియాస్‌ సోఫియా (25), యూసుఫ్‌ అలియాస్‌ డాలీ(24) స్నేహితులు. మెహబూబ్‌కాలనీలో నివసించే సయ్యద్‌ హినాయత్‌ (25), ఎండీ హినాయత్‌(24)లతో పరిచయాలున్నాయి. వీరిద్దరు గృహోపకరణాల దుకాణంలో పనిచేస్తున్నారు. సయ్యద్‌ హినాయత్‌, డాలీ ప్రేమికులు. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అతడి బలహీనతను ఆసరా చేసుకున్న డాలీ తరచూ డబ్బులు డిమాండ్‌ చేసేది. కొద్దికాలంగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తీసుకురావటంతో హినాయత్‌ భరించలేకపోయాడు. ఇంట్లో ఒప్పుకోరంటూ చెప్పేశాడు. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే పథకం వేశాడు. మంగళవారం రాత్రి ఇద్దరు హిజ్రాలను దాయిబాబ్‌ వద్దకు రప్పించారు. నలుగురూ కలిసి అక్కడే మద్యం తాగారు. బుధవారం తెల్లవారుజామున హిజ్రాలతో గొడవ మొదలైంది. కత్తులతో హిజ్రాలపై దాడి చేశారు. రక్తపు మడుగులో పడిపోయిన వారిపై బండరాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హిజ్రాలు మృతి చెందారు. సౌత్‌ వెస్ట్‌ డీసీపీ కిరణ్‌కరే, ఏసీపీ సతీష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని