logo

Zero-Ticket: జీరో టికెట్‌పై తనిఖీలు.. రంగంలోకి ఆర్టీసీ బృందాలు

కేపీహెచ్‌బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్‌ సంజీవరెడ్డినగర్‌ వరకూ ఇమ్మని కోరారు.

Updated : 26 Dec 2023 09:32 IST

మహాలక్ష్ముల పేరుతో అదనంగా టికెట్ల జారీ!

ఈనాడు, హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలో (KPHB) ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్‌ సంజీవరెడ్డినగర్‌ వరకూ ఇమ్మని కోరారు. కండక్టర్‌ కోఠి వరకూ జీరో టికెట్‌ ఇచ్చారు. అదేంటని ప్రశ్నిస్తే మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని కండక్టర్‌ అన్నాడు. మరొకరికి అలాగే టికెట్‌ (Zero-Ticket) జారీ చేసినట్టు తేలింది. ఎక్కువమందిని తీసుకెళ్తున్నట్టు చూపించడానికా అంటూ మహాలక్ష్ములు నిట్టూర్చారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్‌జోన్‌ అధికారుల దృష్టికి వెళ్లాయి. యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు.

18 లక్షల మంది ప్రయాణం.. : అవే 2850 బస్సులు.. ప్రయాణికులు రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్‌ప్రెస్‌, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్‌, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

తెలంగాణ ఆధార్‌,ఓటరు కార్డుంటేనే: ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట  గుర్తింపుకార్డు అందజేసే వరకూ ఆధార్‌, ఓటరు ఐడీకార్డును అనుమతిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణేతర ఆధార్‌, ఓటరు ఐడీ కార్డు ఉంటే అనుమతించడం లేదనేది గుర్తించాలన్నారు.

డీఎంల నజర్‌.. : గ్రేటర్‌ పరిధిలో సిటీబస్సుల ప్రయాణాలపై డిపో మేనేజర్లు నజర్‌ పెట్టారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఈనెల 9 నుంచి ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. నాటినుంచి అనూహ్యంగా ప్రయాణికులు పెరిగారు. ఊహించని విధంగా ఈ సంఖ్య గ్రేటర్‌ జోన్‌ పరిధిలో పెరగడంపై అధికారులు దృష్టిసారించారు. ఇష్టానుసారం జీరో టికెట్లు జారీచేసి ప్రయాణికులు పెరిగినట్టు చూపించడం సరికాదని భావించారు. ప్రభుత్వం నుంచి రాయితీ మొత్తాన్ని భారీగా పొందాలనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు యాజమాన్యంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రయాణికులు లేకుండా జీరో టికెట్‌ జారీ చేసినా.. ప్రయాణించే దూరం కంటే ఎక్కువ దూరానికి టికెట్‌ ఇచ్చినా చర్యలు తీసుకుంటున్నామని గ్రేటర్‌జోన్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని