logo

C Vigil: సీ విజిల్‌.. ఉల్లంఘనులకు హడల్‌

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది.

Updated : 24 Mar 2024 08:44 IST

ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే చర్యలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ విజిల్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకమైనవాటిపై ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతులు, మద్యం పంపిణీ, రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ ప్రకటనలు వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీ విజిల్‌ యాప్‌ ద్వారా 7,626 ఫిర్యాదులు అందాయి.

15 నిమిషాల్లో ఘటనాస్థలానికి.. ఎన్నికల నియమావళికి విరుద్ధమైన చర్యలకు పాల్పడితే.. ఫొటో లేదా ఆడియో లేదా వీడియో రూపంలో సాక్ష్యాలను యాప్‌లో పొందుపరచాలి.  ఉల్లంఘనకు సంబంధించి క్లుప్తంగా వివరించాలి. జియోగ్రాఫిక్‌ ఇన్ఫార్మేషన్‌ సిస్టమ్‌ ద్వారా లోకేషన్‌ అప్‌లోడ్‌ అవుతుంది. అప్‌లోడ్‌ చేసిన 5 నిమిషాల్లో సమాచారాన్ని ఫీల్డ్‌ యూనిట్‌కు పంపిస్తారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌, రిజర్వ్‌ బృందాల సభ్యులు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. 30 నిమిషాల్లో వివరాలు సేకరించి  రిటర్నింగ్‌ అధికారికి నివేదిస్తారు. ఆయన దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. వ్యక్తిగత వివరాలు తెలియజేయకుండా సైతం ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.

రిజిస్టర్‌ చేసుకోవడం సులభం.. ‘సీ విజిల్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చరవాణి నంబరు ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.  ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ముందుగా తీసిన చిత్రాలు, వీడియోలను అనుమతించదు. నేరుగా యాప్‌ ద్వారా తీసిన వాటినే  అప్‌లోడ్‌ చేయడానికి అవుతుంది. ఒక వ్యక్తి ఎన్ని ఫిర్యాదులైనా చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని