logo

అధికారులే గుత్తేదారులై

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చులకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయి. కొందరు అధికారులే గుత్తేదారుల అవతారమెత్తి జేబుల్లో వేసుకున్నారు.

Published : 06 Apr 2024 06:12 IST

ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో గోల్‌మాల్‌
నకిలీ బిల్లులు, బినామీలతో రూ.కోట్లలో దందా

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చులకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయి. కొందరు అధికారులే గుత్తేదారుల అవతారమెత్తి జేబుల్లో వేసుకున్నారు. వాటినే ఆమోదించిన బిల్లులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఖర్చు చేసి.. అలా బిల్లు తీసుకునే పనులను వారే చేపట్టారు. నకిలీ బిల్లులు, బినామీల పేర్లతో రూ.కోట్లు గడించారు. హైదరాబాద్‌ జిల్లాలో జరిగిన రూ.23 కోట్ల చెల్లింపుల్లో చాలావరకు గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికలంటే పండగే.. ఎన్నికల నిర్వహణ ఖర్చుకు ఆడిట్‌ ఉండదనే కారణంతో పలువురు రిటర్నింగ్‌ అధికారులు(ఆర్వో), ఏఆర్వో, ఈఆర్వో, బల్దియా సర్కిల్‌ ఇంజినీర్లు, జోనల్‌ ఇంజినీర్లు, ఉపకమిషనర్లు బరితెగిస్తున్నారు. డ్రైవరు, పీఏ, కంప్యూటర్‌ ఆపరేటర్ల పేర్లతో గుత్తేదారుల అవతారం ఎత్తారు.

  • ఉప్పల్‌: సర్కిల్‌లోని ఉన్నత స్థాయి ఇంజినీరు, మరో సహాయ ఇంజినీరు ఓ వ్యక్తిని బినామీగా పెట్టుకున్నారు. లెక్కింపు, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్ల పనులను సొంతంగా చేసి రూ.లక్షల్లో సంపాదించారు.
  • శేరిలింగంపల్లి: ఓ ఇంజినీరు లెక్కింపు కేంద్రం టెంటుసామగ్రి, ఇతర పనులు కూకట్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ల పేరుతో చేశారు.
  • అంబర్‌పేట: ఓ ఉన్నతాధికారి నకిలీ బిల్లులతో వచ్చిన సొమ్ముతోనే కారు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సర్కిల్‌ ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు భోజనాలు సరఫరా చేసినట్లు లెక్కలు చూపి భారీగా బిల్లులు పొందారు. బహదూర్‌పుర, కార్వాన్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.
  • జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో పని చేసే ఓఇంజినీరు గోషామహల్‌ సర్కిల్‌ ఇన్‌ఛార్జిగా ఉంటూ.. టెండర్లలో గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
  • టెండర్ల ద్వారా చేపట్టిన ఏ ఒక్క పనికి కూడా ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడం గమనార్హం. వీరు మాత్రం బిల్లులు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
  • మలక్‌పేట: ఓ ఉన్నతాధికారి ఎన్నికల విధుల్లోని అధికారులు, సిబ్బందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. డ్రైవరు కుటుంబానికి చెందిన హోటల్‌ పేరుతో బిల్లులు తీసుకున్నారు. సర్కిల్‌ ఉన్నతాధికారి బినామీ పేరుతో స్టేషనరీ వ్యవహారాల కాంట్రాక్టు పనులు చేశారు.

ఎల్బీనగర్‌: హయత్‌నగర్‌ సర్కిల్‌ ఉన్నతాధికారి వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుడు జోనల్‌ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల పనుల్లో హవా చూపారు. స్టేషనరీ, భోజనాలు, తదితర పనులు చేసుకున్నారు. వ్యక్తిగత సహాయకుడు జోనల్‌లోని నియోజకవర్గాల పరిధిలో ఒకటి, రెండు పనులను చేజిక్కించుకుని నిధులు దారి మళ్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని