logo

ఎత్తుకు పైఎత్తు.. ప్రచారానికి కసరత్తు

రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించాయి. సభలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నాయి.

Updated : 11 Apr 2024 05:02 IST

ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీల కార్యాచరణ

 

రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించాయి. సభలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ కంటోన్మెంట్‌ అభ్యర్థితోపాటు మూడు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ స్థానానికి ఆ పార్టీ నగర అధ్యక్షుడు సమీర్‌వాలీ ఉల్లాను అభ్యర్థిగా ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించింది. భారాస నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కంటోన్మెంట్‌ శాసనసభ అభ్యర్థిగా దివంగత నేత సాయన్న కుమార్తె నివేదితను బుధవారం ప్రకటించింది. భాజపా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కంటోన్మెంట్‌ అభ్యర్థిగా ఎవరనేది ఇంకా తేల్చలేదు.

సభల ఏర్పాటుతో కాంగ్రెస్‌ దూకుడు

తుక్కుగూడ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆ స్థాయిలో కాకపోయినా అన్ని లోక్‌సభ స్థానాల పరిధిలో వచ్చే 20 రోజుల్లో భారీ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. పోలింగ్‌కు ముందు కంటోన్మెంట్‌లోనూ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అనుకున్నారు. ఇప్పటివరకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రతి లోక్‌సభకు సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. చేరికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలోనే కొంత చేరికలు తక్కువగా ఉన్నాయి. మేయర్‌ విజయలక్ష్మి మాత్రం హస్తం గూటికి చేరుకున్నారు. ఇప్పుడు చేరికలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున ప్రచారాన్ని మొదలు పెట్టలేదని శ్రేణుల్లో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించారు.

చేవెళ్ల సభపైనే భారాస దృష్టి

ఈ నెల 13న చేవెళ్లలో భారీ సభను నిర్వహించడానికి భారాస ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్‌ పార్టీ తక్కుగూడలో నిర్వహించిన సభ కంటే భారీ స్థాయిలో నిర్వహించి గ్రేటర్‌ పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకురావాలని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. కేటీఆర్‌, హరీష్‌రావుతోపాటు మరికొంతమంది నేతలు జనసేకరణపై దృష్టిసారించారు. దీని తరువాత శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో 19 చోట్ల భారాసకు ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఆశించిన స్థాయిలో ప్రచారం పర్వంలో దిగలేదు. చేవెళ్ల సభ తరువాత నియోజకవర్గాల వారీగా మినీ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో విజయాన్ని చేకూర్చే బాధ్యతను కేటీఆర్‌ తీసుకున్నారు.


ఇంటింటి ప్రచారానికి భాజపా

భారీ సభలను నిర్వహించడం కంటే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందన్న భావనలో భాజపా ఉంది. ఒక సభను నిర్వహించాలంటే కనీసం రెండు మూడు రోజులు కీలకమైన నేతలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికంటే కాలనీల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి చెబుతున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మూడు నాలుగు చోట్ల మరో పది రోజుల తరువాత సభలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ రంజాన్‌ తరువాత వచ్చే సోమవారం నుంచి హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తమ ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని