logo

తూచ్‌.. కోడ్‌ ఉంది.. మార్చిలో సున్నా బిల్లు.. ఈ నెలలో వెనక్కి..

గత నెలలో గృహజ్యోతి పథకం కింద సరూర్‌నగర్‌ సర్కిల్‌లో పలువురు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరŸంగా సున్నా బిల్లుల జారీ ఆపేసి మిగతా అర్హత ఉన్న వినియోగదారులకు బిల్లులు జారీ చేశారు.

Updated : 11 Apr 2024 07:39 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: గత నెలలో గృహజ్యోతి పథకం కింద సరూర్‌నగర్‌ సర్కిల్‌లో పలువురు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరంగా సున్నా బిల్లుల జారీ ఆపేసి మిగతా అర్హత ఉన్న వినియోగదారులకు బిల్లులు జారీ చేశారు. సున్నా బిల్లు వచ్చిందని సంతోషపడిన వినియోగదారులకు విద్యుత్తు సంస్థ ఈ నెల షాక్‌ ఇచ్చింది. గత నెల జారీ చేసిన సున్నా బిల్లులన్నింటిని వెనక్కి తీసుకుంది. సున్నా బిల్లు మొత్తాన్ని బకాయిలుగా చూపుతూ ఈ నెల బిల్లులో కలిపి వినియోగదారుడికి అందించింది. సరూర్‌నగర్‌ సర్కిల్‌ అల్మాస్‌గూడలో ఓ  వినియోగదారుడికి మార్చి 2న జారీ చేసిన బిల్లులో గృహజ్యోతి రాయితీ రూ.262 చూపారు. సున్నా బిల్లు జారీ చేశారు. ఈ నెల రూ.547 బిల్లుకు సున్నా బిల్లు బకాయి కలిపి రూ.809 చెల్లించాలని బిల్లు జారీ చేశారు. ఈ బిల్లులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘సాంకేతిక సమస్య కారణంగా స్పాట్‌ బిల్లింగ్‌ యంత్రం మార్చిలో సున్నా బిల్లు జారీ అయ్యింది. ఎన్నికల కోడ్‌తో రంగారెడ్డి, వికారాబాద్‌లో గృహజ్యోతి పథకం ప్రారంభించలేదు. దీంతో ఈ నెల ఎలక్ట్రానిక్‌ బిల్లింగ్‌ సిస్టమ్‌(ఈబీఎస్‌) ప్రకారం సాధారణ బిల్లు జారీ అయ్యింది’ అని డిస్కం అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని