logo

మెరుగైన సేవలందించడమే లక్ష్యం: డా.శివకుమార్‌

ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా మెరుగైన ప్రావిడెంట్‌ ఫండ్‌ సేవలందించేలా కృషి చేస్తున్నట్లు రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ డా.శివకుమార్‌ పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 02:53 IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో నిధి ఆప్కే నికట్‌ 2.0 అవగాహన సదస్సు

రామోజీ ఫిల్మ్‌సిటీలో నిధి ఆప్కే నికట్‌ 2.0 సమావేశంలో మాట్లాడుతున్న రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ డా.శివకుమార్‌.. వేదికపై ఈఎస్‌ఐసీ ఎల్బీనగర్‌ శాఖ మేనేజర్‌ కె.వాసంతి, ఈఎస్‌ఐసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.మహేష్‌, అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ జి.రామ్మోహన్‌ 

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా మెరుగైన ప్రావిడెంట్‌ ఫండ్‌ సేవలందించేలా కృషి చేస్తున్నట్లు రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ డా.శివకుమార్‌ పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం నిధి ఆప్కే నికట్‌ (ఎన్‌ఏఎన్‌) 2.0 జిల్లా అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈపీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో నిధి ఆప్కే నికట్‌ 2.0 కార్యక్రమం చేపట్టి పీఎఫ్‌ సేవల కోసం కార్యాలయానికి రాకుండానే ఆన్‌లైన్‌ ద్వారా సేవలందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. మరికొన్ని నెలల్లో సంపూర్ణంగా ఆయా సేవలు మరింత మెరుగ్గా అందించేలా కార్యాచరణ చేపట్టామని వెల్లడించారు. అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ జి.రామ్మోహన్‌ మాట్లాడుతూ.. పదవీ విరమణ రోజునే ఉద్యోగులకు పెన్షన్‌ అందించేలా అవసరమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ప్రతి ఉద్యోగి కేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నామినేషన్‌ నమోదు చేయాలన్నారు. ఈఎస్‌ఐసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.మహేష్‌ మాట్లాడుతూ.. ఈఎస్‌ఐసీ ద్వారా అవరమైన వైద్య సేవలు, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగులు తప్పనసరిగా ఆధార్‌ లింక్‌ చేసుకోవాలని సూచించారు. మొబైల్‌లో త్రిపుల్‌ ఏ ప్లస్‌ యాప్‌ ద్వారా అవసరమైన సేవలను పొందేందుకు అవకాశం ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈఎస్‌ఐసీలో నమోదైన ఉద్యోగుల పిల్లలెవరైనా నీట్‌ ప్రవేశ పరీక్ష రాస్తే వారికి సంబంధిత ఈఎస్‌ఐ వైద్య కళాశాలల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈఎస్‌ఐసీ ఎల్బీనగర్‌ శాఖ మేనేజర్‌ కె.వాసంతి మాట్లాడుతూ.. ఈఎస్‌ఐలో రిజిస్టరైన అనంతరం సమీపంలోని డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలు పొందవచ్చని, నిర్దేశించిన సర్వీస్‌  పూర్తైన అనంతరం కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నిత్యం వైద్య శిబిరం కొనసాగుతుందని, ఉద్యోగులు వార్షిక వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రామోజీ గ్రూప్‌ మానవ వనరుల విభాగం సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

హాజరైన ఉద్యోగులు 

ఉద్యోగుల సందేహాల నివృత్తి

ఈ సందర్భంగా ఉద్యోగులు, ఆయా విభాగాల ప్రతినిధులు చెప్పిన పలు సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐసీ సేవలు పొందే మార్గాలపై డా.శివకుమార్‌, జి.రామ్మోహన్‌, ఎన్‌.మహేష్‌, కె.వాసంతి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని