logo

బుక్‌ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్‌

నీటి ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది.

Updated : 19 May 2024 10:09 IST

3-4 రోజుల నిరీక్షణకు చెల్లుచీటి
అమల్లోకి వచ్చిన కొత్త విధానం

ఈనాడు, హైదరాబాద్‌: నీటి ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. గతేడాది వానలు లేక గ్రేటర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోవడంతో జలమండలి ట్యాంకర్లకు భారీగా డిమాండ్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చిలో డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేక ఇబ్బందులు ఎదురవడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి పలుమార్లు క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహించి పరిస్థితిపై అంచనాకు వచ్చారు. ట్యాంకర్ల సంఖ్యను 584 నుంచి 872కు దశలవారీగా పెంచారు. ఫిల్లింగ్‌ స్టేషన్లను 72 నుంచి 89కు, ఫిల్లింగ్‌ పాయింట్లను 120 నుంచి 164కు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ట్యాంకర్లను నడిపేందుకు తొలుత సిబ్బంది లేక బల్దియా నుంచి డ్రైవర్లను సమకూర్చారు. 

  • ప్రత్యేకంగా ట్యాంకర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటుచేసి వినియోగదారుల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అసలు సమస్యను గుర్తించారు. అన్ని ఫిల్లింగ్‌ స్టేషన్లలోని సీసీకెమెరాలను ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసి.. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడంతో ట్యాంకర్ల సరఫరాలో పారదర్శకత పెరిగింది. నకిలీ బుకింగ్‌లు, పక్కదారి పట్టించడం లాంటి అక్రమాలకు చెక్‌ చెప్పారు.
  • ట్యాంకర్‌ బుక్‌ చేసుకున్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం అందించడం.. ఫిర్యాదులపై విచారించి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం వల్ల జవాబుదారీతనంతో ట్యాంకర్లను సకాలంలో అందించడానికి అవకాశం కలిగింది. ఇలా పలు చర్యలతో గత నెల రోజుల నుంచి ట్యాంకర్ల సరఫరా తీరును మెరుగుపరుచుతూ వచ్చామని జలమండలి అధికారులు తెలిపారు. 
  • తొలుత బుక్‌ చేసిన తర్వాత.. 48 గంటలకు సరఫరా అయ్యేలా చేశామన్నారు. దానిని అలా 12 గంటలకు తగ్గించారు. ప్రస్తుతం 60-70శాతం డివిజన్లలో ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24గంటల్లో సరఫరా చేస్తున్నానని వివరించారు. భవిష్యత్తులో బుక్‌ చేసిన ఆరేడు గంటల్లోనే ట్యాంకర్‌ అందించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్యాంకర్‌ అవసరమయ్యేవారు 155313కు ఫోన్‌ చేసి బుక్‌ చేసుకోవచ్చునని, 12 గంటల్లోనే సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని