logo

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు

వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం.

Updated : 17 May 2024 05:26 IST

‘న్యూస్‌టుడే’తో డీపీవో దేవరాజ్‌
న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం

వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం. వర్షాకాలంలో వైద్యశాఖతో పాటు పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకుని పారిశుద్ధ్యం లోపించకుండా, తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? పారిశుద్ధ్య నిర్వహణ, శుభ్రమైన తాగునీరు అందించే చర్యలపై జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ఆ వివరాలు..

ప్రశ్న: జిల్లాలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు.?

జవాబు: జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా 1670 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామానికో పంచాయతీ కార్యదర్శి ఉండగా ఎన్నికలు ముగియటంతో సీజనల్‌ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు రహదారులు, మురుగు కాలువల శుభ్రం చేస్తున్నాం. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లటం, దోమల నివారణకు బైటిక్స్‌ పించికారీ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు వైద్యఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్యశిబిరాలు నిర్వహిస్తాం.  

ప్ర: పైపులైన్ల లీకేజీతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతుంటారు.?

జ: జిల్లాలో తాగునీటి ట్యాంకులను నెలలో 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేయిస్తున్నాం. ట్యాంక్‌లోకి వస్తున్న మిషన్‌ భగీరథ నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి సరఫరా చేస్తున్నాం. తాగునీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలుపుతున్నారా లేదా అనేది నిత్యం మానిటరింగ్‌ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు ఉంటే సరి చేశాం. ఇంకా ఎక్కడైనా లీకేజీలు ఉంటే సరిచేస్తాం. తాగునీటి ట్యాంకు దగ్గర నీరు నిల్వకుండా, పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉండేలా చూస్తాం. రహదారులపై గుంతలు లేకుండా పూడ్చి శుభ్రత పాటించాలని ఆదేశాలు జారీ చేశాం.

ప్ర: గ్రామాల్లో దోమలు స్వెరవిహారం చేస్తున్నాయి.?

జ: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి వీధిలోనూ దోమల నివారణ మందును పిచికారీ చేస్తున్నాం. పిచ్చి మొక్కలు తొలగించి వీధులను శుభ్రంగా ఉంచుతున్నాం. మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నాం.

ప్ర: సీజనల్‌ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా.?

జ: సీజనల్‌ వ్యాధులపై వైద్యఆరోగ్య, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే చేపట్టి సమస్య రాకుండా చూస్తాం.

ప్ర: వేసవిలో మొక్కల రక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?

జ: వేసవిలో మొక్కలు ఎండి పోకుండా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టిస్తున్నాం. 380 పంచాయతీలకు పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టాం. మొత్తం 22 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలు నాటుతాం. అవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. వర్షాలు పడగానే మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు