logo

పరిశ్రమలతో ప్రగతి!

స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్‌ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Published : 18 May 2024 06:15 IST

స్వశక్తి సంఘాలకు రుణ లక్ష్యం ఖరారు

 అంతర్గాం మండలం గోలివాడ సమావేశంలో పాల్గొన్న మహిళలు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్‌ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సంఘ సభ్యులందరికి కలిసి రుణాలు ఇస్తుండగా కొందరు మహిళలు ఖర్చు చేసే విధానంతో వారు పూర్తిస్థాయి లాభాన్ని పొందలేకపోతున్నారు. ఫలితంగా ఆశించిన ఆర్థికాభ్యున్నతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఒక్కో సభ్యురాలికి వ్యక్తిగతంగా చిన్నతరహా పరిశ్రమలతో లబ్ధి చేకూరేవిధంగా ప్రోత్సహించాలని సంకల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ లక్ష్యం ఖరారైంది. ఈ సారి తొలిసారిగా ఔత్సాహిక పరిశ్రమలను స్థాపించేందుకు రుణాలు కేటాయించారు.

 40,664 సంఘాలు..రూ. 2,548.84 కోట్లు

స్వశక్తి సంఘాల్లోని మహిళల కిరాణం, కంగన్‌హాల్‌, వస్త్ర దుకాణాలు, పిండి గిర్ని, బేకరి, విస్తారాకుల తయారీ, వస్త్ర, జనపనార, పుట్టగొడుగులు తయారీ, వ్యవసాయం, పిల్లల చదువులు, కుటీర పరిశ్రమలు నెలకొల్పుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. పొదుపు ఆధారంగా ఒక్కో సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,664 స్వశక్తి సంఘాలకు రూ.2,548.84 కోట్లు లక్ష్యం విధించారు. గతేడాది 36,996 సంఘాలకు రూ.2,116.85 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. గతేడాది కంటే రుణ లక్ష్యం పెరిగింది. ఈ ఏడాది లక్ష్యాలను చేరుకునేందుకు ఆరంభం నుంచి ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామ స్థాయిలోని సీఏ మొదలుకొని సీసీలు, ఏపీపీఎం, డీపీఎంలతో పాటు జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు.

ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం

బ్యాంకు రుణాలతో మరింత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ ఏడాది వ్యక్తిగత రుణాలకు ప్రాధాన్యం కల్పించారు. జాతీయ జీవనోపాధుల మిషన్‌లో భాగంగా మహిళలను సొంతంగా చిన్నతరహా పరిశ్రమలు స్థాపించేందుకు ఈసారి ‘ఎంటర్‌ప్రైజెస్‌’ రుణాలను అందిస్తున్నారు. ఈ రుణాలతో కొత్తగా పరిశ్రమలు స్థాపించడం, ఒకవేళ ఇప్పటికే ఏదైనా ఒక పరిశ్రమ ఉన్నట్లైతే మరింతగా ఆధునికీకరించేందుకు ప్రోత్సహించనున్నారు. ఒక్కొక్కరికి రూ.5-10 లక్షలలోపు రుణం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా 31,141 మహిళలకు రూ.622.78 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు