logo

కోడ్‌ ముగిస్తేనే ప్రగతి వేగిరం

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్‌ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్‌సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి.

Published : 19 May 2024 03:47 IST

రెండు నెలలుగా నిలిచిన పనులు
పేరుకుపోయిన ప్రజా సమస్యలు

ఈనాడు, పెద్దపల్లి : లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్‌ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్‌సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి.

సార్వత్రిక సమరానికి సంబంధించి మార్చి 16న ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. నాటి నుంచి జూన్‌ 4న ఫలితాలు వెల్లడయ్యే వరకు ప్రవర్తనా నియమావళి అమలులో ఉండనుంది. అభివృద్ధి పనులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ ఈసీ నిబంధనలకు లోబడే సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. వచ్చే నెల 4 తర్వాతే నిధుల కేటాయింపు, పెండింగ్‌ సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితులున్నాయి. అత్యవసర పనులకు సైతం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉండటం కొత్త పనుల ప్రారంభానికి అడ్డంకిగా మారింది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం బదిలీలుంటాయనే ప్రచారంతో అధికారులు కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు.

అంచనాల దశలోనే..

ప్రగతి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున కేటాయించారు. ఇందులో రూ.కోటి నిధులను తాగునీటి ఎద్దడి నివారణకు వెచ్చించాలని మార్చి నెల ప్రారంభంలోనే అధికారులను ఆదేశించారు. మిగిలిన నిధులను ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన పనులకు వినియోగించాల్సి ఉంది. మార్చి 16న ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేటప్పటికి సంబంధిత పనులు అంచనాల దశలోనే ఉండిపోయాయి.

పెండింగ్‌లో ధరణి దరఖాస్తులు

ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎన్నికల ముందు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 10,231 దరఖాస్తులు వచ్చాయి. కోడ్‌ కారణంగా ప్రత్యేక  దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌లకు తాత్కాలికంగా విశ్రాంతి ప్రకటించి సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించుకున్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ధరణిలోని పలు నిబంధనలను సవరిస్తున్నారు. గ్రీవెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌(జీఎల్‌ఎం) ద్వారా వచ్చిన దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

నత్తనడకన ‘మన ఊరు-మన బడి’

జూన్‌ 12న పాఠశాలల పునఃప్రారంభం కానుండగా, ఈలోగా ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో రూ.10 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ ఆధ్వర్యంలో చేపట్టే పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. జూన్‌ 10లోగా మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని సీఎస్‌ శాంతికుమారి ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు, పనులు పూర్తయిన పాఠశాలల భవనాలకు రంగులు వేయాలని, పనులు చేపట్టని చోట్ల వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

వాణి వినేది ఆ తర్వాతే..

కలెక్టరేట్‌లలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జూన్‌ 4 వరకు నిలిపివేశారు. వివిధ సమస్యలను ప్రజలు నేరుగా కలెక్టర్‌కు, అదనపు కలెక్టర్‌లకు విన్నవించే అవకాశం ఉండేది. దీంతో చాలా సమస్యలు పేరుకుపోయాయి. జూన్‌లోనే సాగు ప్రణాళిక, మౌలిక వసతుల కల్పన, రహదారులు, ప్రజారోగ్యం వంటి కీలక విషయాలపై శాఖాపరమైన సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. గుర్తించిన పనులకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. వచ్చే నెల 4 తర్వాతే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

స్థానిక సంస్థలకు నిలిచిన నిధులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,215 పంచాయతీలు, 14 పురపాలికలు, కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల పరిధిలో పలు అభివృద్ధి పనులను అధికారులు గుర్తించి ప్రతిపాదనలు పంపినప్పటికీ కోడ్‌ కారణంగా నిధుల కేటాయింపు నిలిచింది. ఇప్పటికే మొదలైన పనులు కూడా పర్యవేక్షణ లోపంతో నత్తనడకన సాగుతున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. వారు ఎన్నికల విధుల్లో ఉండటంతో పనులు మందగించాయి. పారిశుద్ధ్య పనులు, విద్యుద్దీపాల ఏర్పాట్లు, కాలువల నిర్మాణం, రహదారి నిర్మాణాలకు నిధులు ఇప్పట్లో అందేలా లేవు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని