logo

గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రూప్‌-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

Published : 19 May 2024 03:48 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, చిత్రంలో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ 

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రూప్‌-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షకు ముందు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పాలనాధికారి జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహణపై మాట్లాడారు. కరీంనగర్‌లో పరీక్షకు 36 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 18,663 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. తగిన భద్రత మధ్య ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నాపత్రాలను తరలించాలన్నారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా ప్రధాన గేటు ద్వారానే పరీక్ష కేంద్రంలోకి పంపించాలని సూచించారు. పోలీసు సిబ్బంది నిశితంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని, 10 గంటలకు పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో లైట్లు, పంకాలు, తాగునీరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మే 22న హైదరాబాద్‌లో బయోమెట్రిక్‌ పోలీసు అధికారులకు, పోలీసు నోడల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్, డీఆర్వో పవన్‌కుమార్, డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ లక్ష్మీనారాయణ, జగిత్యాల జేఎన్‌టీయూ కళాశాల  ఆచార్యులు సతీష్‌కుమార్, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ కాళీచరణ్, కరీంనగర్‌ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ శ్రీధర్‌రావు, రజనీ తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయండి

కరీంనగర్‌ కలెక్టరేట్‌: టీఎస్‌ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్‌ సూచించే ‘టీఎస్‌’ స్థానంలో ‘టీజీ’ని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్‌ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు, ఏజెన్సీలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలు, ఏదైన ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్‌ను టీఎస్‌కు బదులుగా టీజీ అని వాడాలని కలెక్టర్‌ కోరారు. లెటర్‌హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్‌సైట్లు, పాలసీ పేర్లు, జీవోలు, ఇతర అధికారిక అంశాలన్నింటిపై టీఎస్‌ స్థానంలో టీజీగా మార్చాలని పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీలోపు అన్ని శాఖల జిల్లా అధికారులు తగిన నివేదికలు పంపాలని, ఆ నివేదికలు క్రోడికరించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని