logo

శిక్షణకు జక్కూరు సై

ఏడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైన జక్కూరు వైమానిక శిక్షణ శాల (జక్కూరు ఫ్లైయింగ్‌ ట్రైనింగ్‌ స్కూల్‌-జీఎఫ్‌టీఎస్‌) పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. విధానపరమైన అడ్డంకులతో ఐదేళ్లుగా మూసి ఉంచిన ఈ స్కూల్‌ పునరుద్ధరణ ప్రక్రియ అనంతరం ఆదివారం నుంచి సేవలకు సిద్ధమవుతోంది.

Published : 23 Jan 2022 00:37 IST

ఐదేళ్ల తరువాత నేడు పునః ప్రారంభం


పిల్లల్లో ఆసక్తి పెంచే శిబిరాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ఏడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైన జక్కూరు వైమానిక శిక్షణ శాల (జక్కూరు ఫ్లైయింగ్‌ ట్రైనింగ్‌ స్కూల్‌-జీఎఫ్‌టీఎస్‌) పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. విధానపరమైన అడ్డంకులతో ఐదేళ్లుగా మూసి ఉంచిన ఈ స్కూల్‌ పునరుద్ధరణ ప్రక్రియ అనంతరం ఆదివారం నుంచి సేవలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, యువజన క్రీడాశాఖ మంత్రి నారాయణగౌడ దీన్ని ప్రారంభిస్తారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి, అమృత మహోత్సవాల నేపథ్యంలో జీఎఫ్‌టీఎస్‌ను పునఃప్రారంభిస్తున్నారు.

అడ్డంకులు అధిగమించి..

శిక్షణ కోసం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అనుమతి, కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌(సీపీఎల్‌), ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌టీఓ)ల అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి పొందిన ఆరు నెలల్లోనే చీఫ్‌ ఫైయింగ్‌ శిక్షకుని(సీఎఫ్‌ఐ) నియామకం, శిక్షణ తరగతులు పూర్తి చేయాలి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన పరిణతి కలిగిన సీఎఫ్‌ఐల నియామకంలో సర్కారు విఫలమైంది. విదేశాల్లో ఇచ్చే సీఎఫ్‌ఐ వేతనాలు రూ.3 లక్షలకు పైగా ఉండగా, సర్కారు రూ.1.8 లక్షలు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో సీఎఫ్‌ఐ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. డిసెంబరు 2020న లైసెన్స్‌ గడువు కూడా పునరుద్ధరించలేకపోయారు. వీటికి రన్‌ వే విస్తీర్ణ వివాదం కూడా న్యాయస్థానంలో ఉండటంతో శిక్షణ తరగతుల నిర్వహణ కష్టమైంది. బీఎంఆర్‌సీఎల్‌(మెట్రో) సహకారంతో ఈ అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు శిక్షణ ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రకటించిన జీఎఫ్‌టీఎస్‌ ఆరు నెలల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకోవటం గమనార్హం.

రూ.25 కోట్ల వ్యయం

జీఎఫ్‌టీఎస్‌ ఆవరణలో ఎయిర్‌ స్క్వాడ్రన్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ యూనిట్‌, జూపిటర్‌ ఏవియేషన్‌ సేవలు, డెక్కన్‌ కార్టర్‌, అగ్ని ఏవియేషన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. హెలి టూరిజమ్‌, లాంజ్‌, 874 మీటర్ల రన్‌ వే, ఐదు సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు, మరో రెండు ట్విన్‌ ఇంజిన్‌ విమానాల మరమ్మతు కోసం రూ.25 కోట్లు వ్యయం చేశారు.

గ్రామీణ ఔత్సాహికులకు అనుకూలం

ప్రభుత్వ నేతృత్వంలో ఫ్లైయింగ్‌ శిక్షణ కోసం వేలాది మంది ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు. రూ.లక్షల వ్యయంతో కూడిన పైలెట్‌ శిక్షణ అంటే గ్రామీణ విద్యార్థులకు నెరవేరని కలగా మిగిలింది. 18 నెలల శిక్షణకు రూ.32 లక్షల ఫీజు వసూలు చేస్తారు. బీపీఎల్‌ కుటుంబ విద్యార్థులు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఓ బ్యాచ్‌కు గరిష్ఠంగా వంద మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం 35 మందితోనే ప్రారంభిస్తారు. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ 2023 ఆగస్టులో ముగుస్తుంది.

జక్కూరు పరిసరాల్లో విహరిస్తున్న శిక్షణ లోహవిహంగాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని