logo

హుబ్బళ్లి రహదారిపై రక్తపుటేరు

పెళ్లి బృందంతో వెళ్తున్న క్రూసర్‌ వాహనం చెట్టును ఢీకొని తొమ్మిది మంది దుర్మరణం చెందిన దుర్ఘటన మాయకమునుపే.. అదే ప్రాంతంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఒక్కకుదుపుతో బస్సు నిలిచిపోయింది.

Published : 25 May 2022 05:07 IST

నుజ్జయిన లారీ ముందు భాగం..

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : పెళ్లి బృందంతో వెళ్తున్న క్రూసర్‌ వాహనం చెట్టును ఢీకొని తొమ్మిది మంది దుర్మరణం చెందిన దుర్ఘటన మాయకమునుపే.. అదే ప్రాంతంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఒక్కకుదుపుతో బస్సు నిలిచిపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. బస్సు ముందు సీట్లలో కూర్చున్నవారిలో ఆరుగురు దుర్మరణం చెందారు. బస్సు ముందుభాగం నుజ్జయింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది.

కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు, ఎదురుగా బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. దుర్ఘటన స్థలంలోనే బస్సులు నలుగురు- లారీలో ఇద్దరు- మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 26 మందికి గాయాలయ్యాయి. వీరిని హుబ్బళ్లి నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మృతులను ఇచలకరంజి నివాసి బాబాసో చౌగ్లే (59), బెంగళూరు నివాసులు నాగరాజ ఆచార్‌ (56), అతావుల్లాఖాన్‌ (40), మస్తాన్‌ (43), మైసూరుకు చెందిన మహ్మద్‌ దయాన్‌ బేగ్‌ (17), కొల్హాపూర్‌ నివాసులు అక్షయ దవర్‌ (28), ఆకీఫ్‌ (40), అఫాక్‌ (41)గా గుర్తించారు. మరొకరి పేరు తెలియలేదు. మృతుల్లో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. మిగిలిన వారు బస్సులోని ప్రయాణికులని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని తెలిసింది.

అతివేగమే ఇంత అనర్థాన్ని కల్గించిందని ప్రయాణికులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహారాష్ట్రలోని షోలాపుర నుంచి బెంగళూరుకు బయలుదేరిన ప్రైవేట్‌ బస్సు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడమే పెను ముప్పు తెచ్చిపెట్టిందని వాపోయారు. హుబ్బళ్లి సమీపాన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది తిరిగిరాని లోకాలకు చేరుకున్నారన్న సమాచారం కన్నడనాడును దిగ్భ్రాంతికి గురిచేసింది. బస్సులోని ప్రయాణికుల్లో అత్యధికులు క్షతగాత్రులుగా మిగిలారు. ‘అర్ధరాత్రి కావడంతో అప్పటికే బాగా నిద్రలోకి జారుకున్నాం. అప్పటికి దాదాపు 12.45 గంటలై ఉంటుంది. భీకర శబ్దంతో ఒక్క ఉదుటన బస్సు నిలిచిపోయింది. ఏమైందోనని వెనుకన ప్రయాణిస్తున్న మేము, మా స్నేహితులు తెలుసుకునే లోపే ఆర్తనాదాలు మిన్నంటాయి’ అంటూ ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ముందువైపు కూర్చున్న వారు విగత జీవులుగా మారారని తెలిపారు. హుటాహుటిన దిగేందుకు ప్రయత్నిస్తే కాళ్లు విరిగిన బాధ... ఎలాగోలా కిందకు దిగామని క్షతగాత్రులైన వారు వివరించారు. ఎదురుగా.. బియ్యం బస్తాలతో వచ్చిన లారీ- మేం ప్రయాణించిన బస్సు ఢీకొన్నాయని కిందికి దిగిన తరువాత తెలిసిందన్నారు.

తల్లి గుండె గాయం : గాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రి పడకపై పడుకుని ఉన్న తల్లి.. ఎందుకు తన తల్లి కదలడం లేదని రోదిస్తున్న చిన్నారి.. ఈ హృదయ విదారక సంఘటన హుబ్బళ్లి కిమ్స్‌ ఆసుపత్రిలో అందరి మనసుల్ని కలిచివేసింది. బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరైన మహారాష్ట్రకు చెందిన మహిళను కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తన తల్లి ఎంతసేపటికీ మాట్లాడలేదని ఆమె ఏడాదిన్నర కొడుకు రోదిస్తున్నాడు. నర్సులు ఎంతగా బుజ్జగించినా ప్రయోజనం లేకుండాపోయిందని వైద్యులు తెలిపారు. తల్లికి బాగా గాయాలయ్యాయని, అదృష్టవశాత్తు పిల్లాడికి ఏమీ కాలేదని వివరించారు.

గాయపడి నిద్రిస్తున్న తల్లిపై రోదిస్తున్న చిన్నారి

బస్సు ముందుభాగం ఇలా ధ్వంసమైంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని