చూపంతా కన్నడ నాడుపైనే
విధానసభకు ఎన్నికల ఢంకా మోగగానే పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అధికార పక్షం మరో నాలుగైదు రోజుల్లో తమ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది.
సున్నిత అంశాలపై పార్టీల దృష్టి
ఈనాడు, బెంగళూరు : విధానసభకు ఎన్నికల ఢంకా మోగగానే పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అధికార పక్షం మరో నాలుగైదు రోజుల్లో తమ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఆప్.. తొలి విడత అభ్యర్థులను ప్రకటించి మరో దశ ప్రచార రథాలను సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలను తోసిపుచ్చలేమని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. మే 10న దేశంలో మరే రాష్ట్రంలోనూ ఎన్నికలు లేకపోవటంతో కర్ణాటక ఫలితాలపై యావత్తు భారతదేశం కళ్లప్పగించి చూస్తోంది. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్.. కీలక నేతలను రాష్ట్రంలో తిష్ట వేయించి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇన్ని చేసినా ఓటర్లను కొన్ని కీలకమైన అంశాలు ప్రభావితం చేయగలవు. ఆ అంశాలేవంటే..
రిజర్వేషన్ సవరణ
సమాజంలో అత్యంత సున్నితమైన రిజర్వేషన్ అంశం ఆరు నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. అధికార, విపక్షాలు, పలు సముదాయాల నడుమ రిజర్వేషన్ అంశం ఎంతకీ తెగని సామాజిక రగడగా మారింది. అన్నింటికీ మించి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చిన హామీలను అత్యంత నాటకీయంగా అమలు చేయటం సర్వత్రా చర్చకు దారి తీస్తున్నాయి. పాలన పగ్గాలు అందుకుని ఏళ్లు గడుస్తున్నా కనీస ఆలోచన చేయని పార్టీలు సరిగ్గా ఎన్నికల వేళ రిజర్వేషన్‌పై హామీలివ్వటం గమనార్హం. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవకాశం ఉందా? లేదా? రాజ్యాంగపరమైన అడ్డుంకులను తొలగించుకునే సమయం లేని వేళ ఈ ప్రకటనలు రాజకీయ లబ్ధి కోసమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్ పెంపు, వర్గీకరణ, ఒక్కలిగ, లింగాయత్‌లకు 2ఏ, 2బీలో చోటు, ముస్లిం రిజర్వేషన్ రద్దు.. ఆపై అమలు కాని ఈడబ్ల్యూఎస్‌లో చోటు.. తదితర నిర్ణయాలు రెండు నెలల కాలంలో చర్చకు కారణమయ్యాయి. రాజకీయ పార్టీల సహజ సిద్ధమైన వాదోపవాదాలు అటుంచితే.. సగటు ఓటరు పార్టీల ఊసరవెల్లి తీరును గమనించి తన నిర్ణయాన్ని మే 10న వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.
మోదీ ఆధ్వర్యంలో మొన్నటి వరకు కొనసాగిన ప్రారంభోత్సవాల పరంపర
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత బలిష్టంగానే ఉంది. దక్షిణాన పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పోరు అధికార పక్షానికి సవాలుగా మారింది. జాతీయ నేతల అండదండలు అంతంత మాత్రంగా ఉన్నా సిద్ధరామయ్య, డీకే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున నేతృత్వంలో పార్టీ జోరుగా కనిపిస్తోంది. ఈ ఊపులో మహిళలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్తు వంటి ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే నాలుగు ఉచిత పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ మరో వారం రోజుల్లో మరో ఉచిత పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది.
ఎంత కాదన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపగలవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత మూడు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతిసారీ భారీ స్థాయిలో అభివృద్ధి పథకాలు ప్రకటించి వెళ్లారు. ప్రగతి కార్యక్రమాలు ప్రభావం చూపుతాయనేది రాజకీయ పండితుల విశ్లేషణ.
వ్యతిరేకత ఎంత?
సాధారణంగా రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా గత ప్రభుత్వానికి మరోమారు అవకాశం ఇచ్చింది లేదు. ఆ సంప్రదాయం పునరావృతమైతే ఈ సారి కొత్త పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందే. పైగా ప్రస్తుత ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు గతంలో ఏ ప్రభుత్వంపైనా రాలేదన్న వాస్తవాన్ని చరిత్ర చెబుతోంది. 40 శాతం కమీషన్, ముఖ్యమంత్రి బొమ్మై నాయకత్వ వర్చస్సు, మెజార్టీ లేకున్నా వక్రమార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న అపవాదు, తాజాగా అధికార ఎమ్మెల్యే అక్రమాల బాగోతాలు.. వంటివి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినవే. ఈ పరిణామాలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు.
సామాజిక న్యాయం.. భాజపా లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న యడియూరప్ప. చిత్రంలో శోభా కరంద్లాజె తదితరులు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రిజర్వేషన్లు, వాటి వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దుయ్యబట్టారు. బంజార సముదాయానికి రిజర్వేషన్ల కోటా తగ్గిపోయిందంటూ వారిని రెచ్చగొట్టి, ఆందోళనలు చేసేలా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె, ఇతర నాయకులతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల వర్గీకరణతో అన్ని సముదాయాలకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. ముస్లింలకు ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లను అందుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి భాజపాకు వచ్చిన ఏ నాయకుడూ తిరిగి బయటకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. భాజపా తరఫున తాము ఇప్పటికే మూడు సమీక్షలు చేయించామని, భాజపా భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం తథ్యమని గుర్తించామన్నారు. భాజపాకు వచ్చిన ఆదరణ చూడలేక తప్పుడు సమీక్షల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోందని ఆరోపించారు. టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియను భాజపా ఇప్పటికే ప్రారంభించిందన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీ నాయకులు అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు. వరుణలో సిద్ధరామయ్యపై విజయేంద్ర పోటీ చేస్తారా లేదా అనే అంశాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. వరుణలో సిద్ధరామయ్య గెలుపు సాధించడం అంత సులవు కాదన్నారు.
ఈసారి కాంగ్రెస్‌దే అధికారం
సిద్ధరామయ్య విశ్వాసం
గుబ్బి ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అవినీతి భాజపా పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం తథ్యమని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగళూరు కాంగ్రెస్‌భవన్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనతాదళ్ నేత, గుబ్బి శాసనసభ్యుడు ఎస్.ఆర్.శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి చేరారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధు తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు భాజపా నేతలు సత్యానంద (మండ్య), హలప్ప (మూడిగెరె) తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా సిద్ధు మాట్లాడుతూ భాజపా, జేడీఎస్‌లో నేతలు ఉండలేని వాతావరణం నెలకొన్నట్లు వివరించారు. జేడీఎస్ ఎప్పటికీ స్వశక్తితో అధికారంలోకి రాబోదని స్పష్టం చేశారు. డీకే మాట్లాడుతూ భాజపా శాసనసభ్యులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 13 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, ఐదుగురు జేడీఎస్ శాసనసభ్యులు, ఇద్దరు స్వతంత్రులను భాజపాలో చేర్చుకున్నప్పుడు ముఖ్యమంత్రికి నైతికత గుర్తు రాలేదా? అని నిలదీశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్, మాజీ మంత్రి మోటమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్త ఆత్మహత్యాయత్నం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కాంగ్రెస్ రెండో జాబితాలో తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఇక్కడ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇళ్ల వద్ద ఆందోళనలకు దిగారు. సిద్ధు ఇంటి వద్ద హైడ్రామా కొనాసగింది. మొలకాల్మూరు నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నేత యోగేశ్‌కు మద్దతుగా ఆందోళన చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయగా.. మిగతా కార్యకర్తలు అడ్డుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను