logo

సీనియర్‌ నేత శ్రీనివాసప్రసాద్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ఆరుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు కర్ణాటక విధానసభకు ఎన్నికైన సీనియరు నాయకుడు వి.శ్రీనివాస ప్రసాద్‌ (76) ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు.

Published : 30 Apr 2024 01:35 IST

శ్రీనివాస ప్రసాద్‌

మైసూరు, న్యూస్‌టుడే : కేంద్ర మాజీ మంత్రి, ఆరుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు కర్ణాటక విధానసభకు ఎన్నికైన సీనియరు నాయకుడు వి.శ్రీనివాస ప్రసాద్‌ (76) ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు. మూత్రపిండాల వైఫల్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆయనను ఏప్రిల్‌ 22న బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మైసూరు జయలక్ష్మిపురంలోని ఆయన నివాసం వద్దకు సోమవారం ఉదయం తరలించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన భార్య భాగ్యలక్ష్మి, కుమార్తెలు ప్రతిమ, పూర్ణిమ, పూనం తెలిపారు. మైసూరు సిల్కు ఫ్యాక్టరీ కూడలిలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ట్రస్టు ఆవరణలో బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీనివాసప్రసాద్‌కు సంతాప సూచకంగా మంగళవారం మైసూరు, చామరాజనగర జిల్లాల్లో అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, కుమారస్వామి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర తదితరులు సంతాపం తెలిపారు.

ఆరుసార్లు చామరాజనగర లోక్‌సభ నియోజకవర్గం నుంచి, రెండుసార్లు నంజనగూడు నుంచి అసెంబ్లీ బాట పట్టిన శ్రీనివాస ప్రసాద్‌ విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రారంభంలో జనసంఘ్‌ నిర్వహించే సభలు, సమావేశాల్లో పాల్గొంటూ, 1972 నుంచి క్రియాశీల కార్యకర్తగా మారారు. ఏబీవీపీలోనూ చురుకుగా ఉండేవారు. బూసా ఉద్యమానికి 1973లో నేతృత్వం వహించారు. మైసూరు కృష్ణరాజ నియోజకవర్గంలో 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సంస్థా కాంగ్రెస్‌ విజయం సాధించింది. దాని నాయకుడు రామకృష్ణ హెగ్డే పిలుపుతో ఆ పార్టీలో చేరారు. అక్కడ యువ విభాగం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. అత్యయిక పరిస్థితిలో భారతీయ జనసంఘ్‌, సంస్థా కాంగ్రెస్‌, సమాజవాది పార్టీ, భారతీయ లోకదళ్‌, స్వతంత్ర పార్టీ 1977లో విలీనమై జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీలో కార్యవర్గ సభ్యునిగా నియమితులై 1977లో చామరాజనగర లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. టీ నరసీపుర అసెంబ్లీ నుంచి 1978లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం చామరాజనగర లోక్‌సభ స్థానం నుంచి ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1980లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2013-2017 వరకు పని చేశారు. సిద్ధరామయ్య తనను మంత్రి పదవి నుంచి తప్పించడంతో భాజపాలో చేరారు. భాజపా అభ్యర్థిగా చామరాజనగర నుంచి 2019లో విజయం సాధించారు. తనకు ఆరోగ్య క్షీణించిందని, ఇకపై ఏ ఎన్నికలలోనూ పోటీ చేయనని గత ఏడాదే ప్రకటించారు.

శ్రీనివాసప్రసాద్‌కు అంతిమ నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

శ్రీనివాసప్రసాద్‌కు అంతిమ నివాళులర్పిస్తున్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని