logo

నలుగురు బాలలు ఈతకు వెళ్లి నీటిపాలు

పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఆ నలుగురు బాలురు నీట మునిగి మృతి చెందిన ఘటన హాసన జిల్లా ఆలూరు తాలూకా ముత్తిగె గ్రామంలో గురువారం విషాదం నింపింది.

Published : 17 May 2024 03:41 IST

హాసన, న్యూస్‌టుడే : పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఆ నలుగురు బాలురు నీట మునిగి మృతి చెందిన ఘటన హాసన జిల్లా ఆలూరు తాలూకా ముత్తిగె గ్రామంలో గురువారం విషాదం నింపింది. మృతులను జీవన్‌, సాధ్విక్‌, విశ్వ, పృథ్విగా గుర్తించారు. వీరంతా ఐదో తరగతి బాలలు. అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి ఆలూరు గ్రామీణ ఠాణా పోలీసులు మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. ఆ చిన్నారులను చూసి ఊరంతా కంట తడిపెట్టింది.


బెదిరించబోయి.. కడతేరిపోయాడు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్యకు వీడియో కాల్‌ చేసి బెదిరిస్తున్న సమయంలో హఠాత్తుగా మెడకు ఉరి బిగుసుకుని అమిత్‌ కుమార్‌ (28) అనే యువకుడు మృతి చెందాడు. బిహారుకు చెందిన బాధితుడు దాసరహళ్లిలో ఉంటూ జిమ్‌ తర్ఫీదుదారునిగా ఉపాధి కల్పించుకున్నాడు. గత ఏడాదే ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అతని భార్య నర్సింగ్‌ కోర్సులో చేరింది. భర్తతో గొడవ పడి రెండు వారాల కిందటే పుట్టింటికి వెళ్లింది. తిరిగి రావాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో ఉరి వేసుకుంటున్నానని బుధవారం రాత్రి వీడియో కాల్‌ చేశాడు. చేతిలో ఉన్న చరవాణి జారి పడడంతో, దాన్ని పట్టుకునే ప్రయత్నంలో పీట పైనుంచి జారి కింద పడ్డాడు. ఉరి బిగుసుకుని మృతి చెందాడని బాగలగుంటె ఠాణా పోలీసులు వెల్లడించారు.


విద్యార్థిని అనుమానాస్పద మృతి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఓ ప్రైవేటు కళాశాలలో రెండో ఏడాది డిగ్రీ చదువుతున్న ప్రభుధ్యా (21) అనే విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన ఇంటి స్నానాల గదిలో ఆమె మృతదేహాన్ని గురువారం గుర్తించారు. గొంతు కోయడంతోనే ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం గుర్తించవలసి ఉందని చెప్పారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు నేపథ్యంలో అసహజ మృతిగా సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


చెల్లెళ్లను వెంటాడుతున్న యువకుడిని కడతేర్చిన అన్న

బెళగావి, న్యూస్‌టుడే : యువతుల వెంటబడుతున్న గాంధీనగర నివాసి ఇబ్రహీం గౌస్‌ (22) అనే యువకుడు కడతేరిపోయాడు. ఆ యువతుల సోదరుడు- ముజామిల్‌ సత్తిగేరి అనే యువకుడు ఆగ్రహంతో గౌస్‌ను గురువారం హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమించే వాడు ఒకరితోనే మాట్లాడతాడని.. తన చెల్లెళ్లు ఇద్దరినీ వేధిస్తున్న నీ ప్రవర్తన మార్చుకోవాలని అతన్ని ముజామిల్‌ పలుసార్లు హెచ్చరించాడు. అతను తీరు మార్చుకోకపోవడంతో మహంతేశ్‌ లేఅవుట్ వద్ద స్క్రూ డ్రైవరుతో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన గౌస్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించాకా చికిత్స పొందుతూ మరణించాడు. పరారీలో ఉన్న నిందితుని కోసం మాళ మారుతి ఠాణా పోలీసులు గాలింపు చేపట్టారు.


గర్భంలో బిడ్డను తీసి.. గుడ్డను వదిలేశారు

కోలారు, న్యూస్‌టుడే : కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన చంద్రిక అనే మహిళ మే ఐదున కోలారు జిల్లాసుపత్రిలో చేరారు. అదే రోజు శస్త్రచికిత్స (సిజేరియన్‌) చేసి వైద్యులు కాన్పు చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు కడుపునొప్పి తీవ్రం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. స్కానింగ్‌లో చంద్రిక కడుపులో మూడు అడుగుల పొడవైన వస్త్రం ముక్క ఉండిపోయినట్లు గురువారం గుర్తించారు. ఆమెకు అవసరమైన సపర్యలకు ఉపక్రమించారు. సిజేరియన్‌ సమయంలో రక్తస్రావాన్ని నిలిపేందుకు అడ్డుగా ఉంచిన ఆ వస్త్రం ఉండను తీయకుండానే కుట్లు వేశారని చంద్రిక భర్త రాజేశ్‌ ఆరోపించారు. వైద్యులు నాగవేణి, విజయ్‌ జుమార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోలారు నగర ఠాణా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని