logo

కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు

వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు.

Published : 20 May 2024 02:45 IST

బండీపుర పర్యాటకం జోరు

బండీపుర జాతీయ ఉద్యానవన ప్రవేశ ద్వారం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. పడమటి కనుమలు- నీలగిరి కొండల సంగమ ప్రాంతంగా విరాజిల్లే బండీపురలో ప్రకృతి సిద్ధమైన వనాలు, విహరించే వన్యజీవులు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడికి విహారానికి వచ్చే వారి కోసం అటవీ, పర్యాటక శాఖలు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాయి. మైసూరుకు సమీపంలోనే.. చామరాజనగర జిల్లా పరిధిలో విస్తరించిన ఈ బండీపుర జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించడం ఎంతో సులువు. కర్ణాటకలోని వివిధ జిల్లాలతో పాటు సమీప కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి రహదారుల సౌకర్యం ఉండటంతో సందడి పెరుగుతోంది. బండిపుర అటవీ వసతిగృహాలు (జంగల్‌ లాడ్జెస్‌) రిజర్వు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాత్రిపూట కీకారణ్యంలో విశ్రాంతి తీసుకోవడం అందరిలోనూ ఆసక్తికి కారణం. ఇక్కడికి వచ్చేవారు పులులు, ఏనుగుల సఫారీ ఎంచుకోవడానికి ముందుకొస్తుంటారు. ఈ చుట్టుపక్కల 73 పులులున్నట్లు లెక్కతేలింది. అందులో ఎన్నో కొన్ని సఫారీ వేళ ఎదురు పడుతుంటాయి. దేశంలోనే అరుదైన నల్లపులులనూ చూడొచ్చు. సుమారు 874 చదరపు కిలోమీటర్లు విస్తరించిన జాతీయ ఉద్యానవనం సస్యందాలూ తక్కువేమీకాదు. ఎత్తైన కొండలు, లోయల్లో సాగే చిరు జలపాతాలు, వాటి దిగువన చెరువులు, అక్కడికి వచ్చి వెళ్లే జంతువులతో ఒకటే సందడి. పులుల అనుపానలు ఎప్పటికిప్పుడు తెలుసుకోవడానికి గుర్తించిన వాటన్నింటికీ మైక్రో చిప్స్‌ అమర్చారు. వాటి సాయంతో కదలికలను సులువుగా గమనిస్తుంటారు. వేటగాళ్లను నియంత్రించేందుకు, పర్యాటకుల భద్రత కోసం కీలక ప్రదేశాల్లో 68 నిఘా కెమెరాలను అమర్చారు. బండీపుర మధ్యలోనే జాతీయ రహదారి (181) కేరళ దిశగా సాగుతుంది. వన్యజీవుల సంరక్షణ కోసం రాత్రిపూట ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. వన్యధామంగా 1973లో దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అర్ధశతాబ్దంలో ఎంతో అభివృద్ధి సాధించి, విహార కేంద్రంగా రూపుదాల్చింది.

సంచరిస్తున్న ఏనుగుల దండు

వనసీమలో అరుదైన నల్ల పులి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని