logo

ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం

కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.

Published : 20 May 2024 06:08 IST

ఇటీవల ఏడూళ్లబయ్యారంలో రాగితీగ కోసం ధ్వంసం చేసిన నియంత్రిక 

పినపాక, న్యూస్‌టుడే: కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల వరుసగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు రావడం, పోలీసులు బందోబస్తులో నిమగ్నం కావడం దొంగలకు వరంగా మారింది. పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారం ఉప కేంద్రం పరిధిలోనే సుమారు 20 వ్యవసాయ విద్యుత్తు నియంత్రికలు ధ్వంసం అయ్యాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత వానాకాలం, ప్రస్తుత రబీ సీజన్‌ కాలంలోనే ఇన్ని చోరీలు చోటుచేసుకోవడం గమనార్హం. పంట పొలాల మధ్యలో నియంత్రికలు ఉండటంతో దొంగలను పట్టుకోవడం కష్టతరంగా మారింది. 

రైతులపై మరమ్మతుల భారం..

రైతులు విద్యుత్తు నియంత్రిక పొందాలంటే సాగు పరిసరాల్లో సుమారు 5 విద్యుత్తు మోటార్లు ఉండాలి. వారంతా ఉమ్మడిగా దరఖాస్తు చేసుకుని సంస్థ నిబంధనల మేర నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క నియంత్రిక ధ్వంసం చేస్తే పునరుద్ధరణకు సుమారు రూ.50 వేల మేర ఖర్చు వస్తుంది. సాగు సమయంలో దొంగలు నియంత్రికను ధ్వంసం చేస్తే..  పంటలు ఎండే పరిస్థితి ఎదురవుతోంది. రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఎవరైనా చేయిస్తున్నారా? 

చిల్లర దొంగతనాలు చేసుకొనే వారిని గుర్తించి పలువురు అక్రమార్కులు ఈ తరహా చోరీలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడటంతోనే వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయన్న భావన నెలకొంది. చోరీ చేసిన రాగి తీగను కిలోకు రూ.800 చొప్పున దొంగలు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయానికి ఎక్కువగా 25 కేవీ విద్యుత్తు నియంత్రికలు వినియోగిస్తుంటారు. వీటిలో రాగితీగ 20 కిలోలు ఉంటుంది. దీంతో ఒక నియంత్రికను ధ్వంసం చేస్తే రూ.16 వేలు రావడంతో కొందరు చిల్లర దొంగతనాలు మానేసినట్లు సమాచారం.  


ప్రత్యేక బృందంతో నిఘా

పినపాక, కరకగూడెం మండలాల్లో ఈ తరహా చోరీలు జరుగుతున్నట్లు దృష్టికి వచ్చింది. వరుస ఎన్నికల నేపథ్యంలో కాస్త ఇబ్బంది కలిగింది. సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దొంగలను తప్పకుండా పట్టుకుంటాం. 

రవీందర్‌రెడ్డి, మణుగూరు డీఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని