logo

మూల కణం విలువ ఘనం!

పుట్టబోయే బిడ్డ కలకాలం ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రతి తల్లి తపన. భవిష్యత్తులో తన బిడ్డలో ఏదైనా అవయవం దెబ్బతింటే? ఒక్క కణంతో అవయవాన్ని మళ్లీ సృష్టించవచ్చునని, ఆ కణం బిడ్డకు ఆహారమందించే బొడ్డుతాడులోనే ఉందని తెలిస్తే ఇంకేముంది..

Updated : 10 Mar 2024 09:00 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం, న్యూస్‌టుడే, ఖమ్మం వైద్యవిభాగం

పుట్టబోయే బిడ్డ కలకాలం ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రతి తల్లి తపన. భవిష్యత్తులో తన బిడ్డలో ఏదైనా అవయవం దెబ్బతింటే? ఒక్క కణంతో అవయవాన్ని మళ్లీ సృష్టించవచ్చునని, ఆ కణం బిడ్డకు ఆహారమందించే బొడ్డుతాడులోనే ఉందని తెలిస్తే ఇంకేముంది.. ఒడిలో తన బిడ్డవలే పదిలంగా దాస్తుంది. మున్ముందు బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం బొడ్డుతాడులోని మూలకణాలకు ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రసవ సమయంలో మాత్రమే సాధ్యమయ్యే బొడ్డుతాడు సేకరణపై కాబోయే తల్లిదండ్రులకు అవగాహన అవసరమంటున్నారు.

ప్రసవం జరగ్గానే కత్తిరించి పక్కన పడేసే బొడ్డుతాడులో 100 మి.లీ. రక్తం ఉంటుంది. బిడ్డ నుంచి వేరుచేసిన రెండు నిమిషాల్లోనే అందులోని రక్తాన్ని సేకరించి నమూనాలను మైనస్‌ 196 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన లిక్విడ్‌ నైట్రోజన్‌ బ్యాంకులో భద్రపరుస్తుంటారు. సీసాపై బార్‌ కోడింగ్‌, డోనర్‌ పేరు నమోదుచేస్తారు. ఇవి వందేళ్ల వరకు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ వంటి నగరాలకే ఈ బ్యాంకులు పరిమితమయ్యాయి. తమ బిడ్డ మూల కణాలను భద్రపరచాలనుకునే తల్లిదండ్రులు సంబంధిత స్టెమ్‌ సెల్స్‌ బ్యాంకు సిబ్బందిని సంప్రదిస్తే ప్రసవ సమయంలో వాళ్లొచ్చి బొడ్డుతాడు నుంచి రక్తం సేకరిస్తారు. ప్రసవం జరిగిన ఆరేడు గంటల్లోపు నమూనాలను లిక్విడ్‌ నైట్రోజన్‌లో భద్రపరచాల్సిందే.

నమూనాల సేకరణలో వృద్ధి

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిత్యం వందలాది ప్రసవాలు జరుగుతున్నా 2022 వరకు ఏటా పదుల సంఖ్యలో మాత్రమే మూల కణం నమూనాలు సేకరించేవారు. 2023 నుంచి ప్రతినెలా కనీసం ఆరేడు నమూనాలు సేకరిస్తున్నామని వివిధ బ్యాంకుల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు సేకరించిన వాటిలో రెండు నమూనాలను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులకు అందించినట్లు వెల్లడించారు.

ఎందుకంత ప్రాధాన్యం..?

శిశువు జన్మించాక బొడ్డుతాడులో కొంత రక్తం మిగిలి ఉంటుంది. దీన్నే ‘కార్డ్‌ బ్లడ్‌’ అంటారు. ఒకప్పుడు బొడ్డుతాడును వ్యర్థంగా పరిగణించేవారు. దీంట్లో మూల కణాలు (హెమటోపోయిటిక్‌ స్టెమ్‌ సెల్స్‌) ఉంటాయని పరిశోధనల్లో రుజువైంది. మూల కణాలతో సికిల్‌ సెల్‌, తలసీమియా, ల్యుకేమియా  తదితర 80పైగా వ్యాధులను నయం చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ‘ఇటీవల చాలామంది పిల్లలు రక్త రుగ్మతలతో జన్మిస్తున్నారు. సాధారణంగా వారికి రక్తమార్పిడి అవసరం. రక్తం మార్చకుండా వ్యాధులను నయం చేసేందుకు మూల కణాలు శక్తిమంతంగా ఉపకరిస్తాయి’ అని వివరిస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు దాచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకున్నట్లే.. ఏదైనా అవయవం దెబ్బతిన్నా, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చినా మూల కణాలను వినియోగించుకోవచ్చు. మొదటి బిడ్డ మూల కణాలను భద్రపరచలేకపోయిన తల్లిదండ్రులు తమ రెండో బిడ్డ మూల కణాలను నిల్వ ఉంచితే వాటిని ఇద్దరికీ ఉపయోగించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

రూ.75 వేలకు 75 ఏళ్లు

ప్రస్తుతం కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే మూల కణాలను భద్రపరిచే బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. ఆయా బ్యాంకుల సేవలపై ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ సంస్థ 75ఏళ్లు భద్రపరచటానికి రూ.75వేలు తీసుకుంటోంది. నిల్వ చేసిన మూల కణాలను దాత కుటుంబానికి అవసరమైనప్పుడు ఇస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కొన్ని సంస్థలు మూల కణాలను 21ఏళ్ల పాటు నిల్వ ఉంచటానికి రూ.50వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని