logo

మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!

ప్రస్తుత స్మార్ట్‌ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేందుకే పరిమితం అవుతున్నారు.

Published : 17 May 2024 02:04 IST

1-5 విద్యార్థులకు ‘లిటరసీ క్లౌడ్‌’ కార్యక్రమం అమలు

పుస్తకం పఠిస్తున్న విద్యార్థులు

పాల్వంచ, న్యూస్‌టుడే: ప్రస్తుత స్మార్ట్‌ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. నైతికత, ఆత్మవిశ్వాసంతో పాటు జీవిత విలువలు నేర్పే పుస్తక పఠనానికి బాలలు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, పరిశోధన శిక్ష మండలి (ఎస్‌సీఈఆర్టీ) వేసవి ప్రత్యేకంగా ‘లిటరసీ క్లౌడ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌లో కథలు చదవడం, వినడం ద్వారా ‘ప్రాథమిక’ స్థాయి విద్యార్థుల్లో మౌఖిక భాషా వికాసం, అభ్యసనా సామర్థ్యాల అభివృద్ధికి ఆ సంస్థ కృషిచేస్తోంది.

ఖమ్మం జిల్లాలో 813, భద్రాద్రిలో 778 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ‘లిటరసీ క్లౌడ్‌’ కార్యక్రమం అమలు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. డీఈఓ కార్యాలయ అకడమిక్‌ మానిటరింగ్‌ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో బాలల అభ్యసనా సామర్థ్యం మరుగున పడకుండా వారిలో ఆసక్తి కలిగించే కథలను చదివించడం, వినేలా చూడటమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ‘రూం టూ రీడ్‌ ఇండియా ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో ఎస్సీఈఆర్టీ ‘లిటరసీ క్లౌడ్‌’ను రూపొందించింది. ఒకటి నుంచి అయిదో తరగతి పిల్లల స్థాయిలో కథలు రూపొందించారు. వాటిని చదివితే సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల సాయంతో https//literacycloud.org/stories?language=telugu/sort=new లింక్‌ ఆధారంగా వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దీంతో ఆన్‌లైన్‌లో విభిన్న కేటగిరీల కథల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. లేదంటే 040-45209722 నంబరుకు ఫోన్‌చేసి కథలు వినొచ్చు. ఈ సమాచారం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని విద్యా విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతోమంది విద్యార్థులు తెలుగు చదవడం, రాయడంపై వెనకబడుతున్నట్లు ‘విద్యాస్థితిగతి (అసర్‌), ‘న్యాస్‌’ తదితర నివేదికల్లో తేలింది. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ తెలుగు సబ్జెక్టులో చాలామంది విద్యార్థులు అనుత్తీర్ణులైన విషయం తెలిసిందే. ప్రాథమిక స్థాయిలోనే కథల ద్వారా మాతృభాషపై పట్టును పెంపొందిస్తే పై తరగతుల్లో బాగా రాణించగలుగుతారని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

‘లిటరసీ క్లౌడ్‌’ కార్యక్రమం విజయవంతం అనేది పిల్లల తల్లిదండ్రుల చొరవపై ఆధారపడి ఉంటుంది. పఠనాసక్తి ప్రతి ఒక్కరి జీవితానికి వెలుగులు పంచుతుంది. ఏదైనా అంశాన్ని ధారాళంగా చదివే వారికి పద వినియోగం, వాక్య నిర్మాణం, సరైన పద్ధతిలో రాయడం వంటి నైపుణ్యాలు అలవడతాయి. తెలుగు భాషపై పట్టు లభించడంతో పాటు నైతిక విలువలు బోధపడతాయి. నేర్చుకోవాలన్న జిజ్ఞాస బాలల్లో కలుగుతుంది. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బదులు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల సాయంతో కథనాలు   పఠించేలా చూడాలి.

నాగరాజశేఖర్‌, ఏఎంఓ, భద్రాద్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని