logo

అరాచక పాలనకు అంతం తప్పదు

రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

Published : 29 Apr 2024 02:37 IST

కరపత్రాలు చూపుతున్న మల్లెల రాజశేఖర్‌ తదితరులు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా సూపర్‌-6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు హయాంలో ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా ప్రకటించి ఎన్నో పరిశ్రమలకు నాంది పలికారని చెప్పారు. వైకాపా హయాంలో ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదన్నారు. ఎన్నికల్లో వైకాపాను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  నాయకులు పుల్లారెడ్డి, తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహులు, శివ, సిద్ధయ్య, నాగయ్య పాల్గొన్నారు.


మహిళల సంక్షేమానికి పెద్దపీట: బీవీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: తెదేపా విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానన్నారు. 45 రోజుల కిందట ఎమ్మిగనూరుకు వచ్చిన వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకను ఓడించాలన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరాచకాలకు ఎమ్మిగనూరు అడ్డాగా మారిందన్నారు. సాగు, తాగునీరు కోసం రూ.2 వేల కోట్లుతో ఆర్డీఎస్‌ పథకం మంజూరు చేస్తే ఆ పథకానికి ఐదేళ్లలో పైసా నిధులు ఇవ్వలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో అమ్మఒడి పథకం కుటుంబంలో ఒకరికి ఇచ్చి కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ఈసారి తెదేపాను గెలిపిస్తే ఆడబిడ్డ నిధి, మహిళలకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామన్నారు. వైకాపా ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోలో రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంతో తెదేపా మహిళ సంఘం నాయకురాళ్లు సరోజమ్మ, శంకరమ్మ, రేష్మ, పార్వతమ్మ, బడేబీ, తదితరులు పాల్గొన్నారు.


గెలుపు తీరాలు చేరాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ఎన్నికల్లో గెలుపు తీరాలు చేరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తెదేపా గెలుపునకు కృషి చేయాలన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఆయన కర్నూలులో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెదేపా నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారంపై చర్చించారు.


గెలిపిస్తే ప్రజాసేవ చేస్తాం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కులమత బేధాలు చూడకుండా రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ  భరత్‌ కోరారు. కర్నూలు 13వ వార్డులోని ప్రశాంత్‌ టవర్స్‌, నంద్యాల గేటు, మేడం కాంపౌండ్‌, రాజవిహార్‌ తదితర ప్రాంతాల్లో ఆయన ఆదివారం భరోసా యాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి తెదేపాకు ఓటేయాలని కోరారు. సరైన నాయకుడు, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమన్నారు. టీజీవీ సంస్థల తరఫున కొంతవరకే ప్రజాసేవ చేయగలమని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేసేందుకు, కర్నూలును అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, బూత్‌ ఇన్‌ఛార్జులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని