logo

గడప చేరని బియ్యం

పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.

Published : 17 May 2024 04:26 IST

రేషన్‌ సరకుల పంపిణీకి నేడే ఆఖరు
గడువు పెంచాలని పేదల వినతి

కర్నూలు మార్కెట్‌, న్యూస్‌టుడే : పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు. కొందరు ఎండీయూ ఆపరేటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవడం.. పౌరసరఫరాల అధికారులు పట్టించుకోకపోవడంతో సరకుల పంపిణీ అధ్వానంగా సాగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 760 ఎండీయూ వాహనాలు ఉండగా వివిధ కారణాలతో కొందరు ఆపరేటర్లు విధుల నుంచి తప్పుకున్నారు. వీరి బాధ్యతలను మరొకరికి అప్పగించారు. ఇలాంటి చోట్ల పంపిణీ మందగించింది. ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌ రోజున పంపిణీ ఆపేశారు. 17వ తేదీతో సరకుల పంపిణీ గడువు ముగియనుండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.

1,60,368 మందికి అందని సరకులు 

  • కర్నూలు అర్బన్‌తోపాటు 25 మండలాల పరిధిలో 6.76 లక్షల మంది కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి విడుదల చేశారు. 16వ తేదీ నాటికి 5,92,944 మంది కార్డుదారులకు మాత్రమే సరకులు అందజేశారు. ఇంకనూ 83,265 మందికి సరకులు అందాల్సి ఉంది.
  • నంద్యాల జిల్లాలో 5.41 లక్షల మంది కార్డుదారులు ఉండగా 4,64,701 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకనూ 77,103 మంది కార్డుదారులకు సరకులు ఇవ్వాల్సి ఉంది.
  • ఉమ్మడి జిల్లాలో 12.18 లక్షల మంది కార్డుదారులు ఉండగా వీరిలో 10.57 లక్షల మందికి మాత్రమే సరకులు ఇచ్చారు.. 1.60 లక్షల మంది కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరకులు అందలేదు.

కొరవడిన పర్యవేక్షణ

  • అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో చాలామంది ఎండీయూ ఆపరేటర్లు సక్రమంగా సరకులు పంపిణీ చేయలేదు. ఉదయం 7 గంటల నుంచి వాహనాలతో ఇంటింటా సరకులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల పది గంటల వరకు ప్రారంభించలేదు. మధ్యాహ్నం ఎండల తీవ్రత కారణంగా సరకుల పంపిణీకి సమస్యలు ఏర్పడ్డాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సరకులు ఇవ్వాల్సి ఉన్నా కొందరు ఆపరేటర్లు వాహనాలను అందుబాటులో ఉంచలేదు.
  • ఈనెల 11, 12 తేదీల్లో సర్వర్‌ మొరాయించడంతో సరకుల పంపిణీకి ఆటంకం ఏర్పడింది. దీనికితోడు జిల్లాలో పౌరసరఫరాల గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరకులు సకాలంలో చేరలేదు.
  • ఒకసారి ఒక వీధికి వచ్చిన ఎండీయూ వాహనం మళ్లీ అక్కడికి వెళ్లకపోవడంతో చాలామంది సరకుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. పోర్టబులిటీ విధానం అమలుకు కొన్నిచోట్ల ఆపరేటర్లు మోకాలడ్డటంతో పట్టణ ప్రాంతాల్లో పేదలు సరకులు కోల్పోవాల్సి వచ్చింది.

ఇంటింటికి ఎగనామం

  • ఇంటింటికి రేషన్‌ పంపిణీ కాదు కదా.. వీధిల్లోకి ఎండీయూ వాహనాలు రాలేదు. రహదారులపై ఒకచోట వాహనాలు ఆపి కార్డుదారులకు రేషన్‌ సరకులు పంపిణీ చేశారు. ఫలితంగా జనాలకు ఎండలో ఇబ్బందులు తప్పలేదు.
  • పౌరసరఫరాల అధికారులు ఎన్నికల ప్రక్రియలో ఉండగా.. సగం మంది ఎండీయూ ఆపరేటర్లు అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
  • కొన్నిచోట్ల ఎండీయూ ఆపరేటర్లు, చౌక దుకాణాల డీలర్లు కుమ్మక్కై చౌక దుకాణాల దగ్గరే రేషన్‌ పంపిణీ చేశారు. పౌరసరాఫరాల అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రేషన్‌ సరకుల పంపిణీ గడువు పెంచాలని కార్డుదారులు విన్నవిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని