logo

జగన్‌ పాలన.. కష్టాల‘పాలు’

చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు.

Updated : 29 Apr 2024 05:10 IST

ప్రోత్సాహం లేక  తగ్గిపోయిన  ఉత్పత్తి
అవసరం 6 లక్షల లీటర్లు..      
ఉత్పత్తి 4 లక్షల లీటర్లు.!!

చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. పది ఎకరాల విస్తీర్ణంలో నాలుగు షెడ్లు నిర్మించి 300 వరకు పశువులకు ‘వసతి’ కల్పించారు. మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అక్కడ నిత్యం 1,500 లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది.

జగన్‌ వంచన: చంద్రబాబు హయాంలో చేపట్టిన ఏమంచి పని జగన్‌కు నచ్చదు కదా..! గద్దెనెక్కగానే పశు వసతి గృహం నిర్వహణకు కష్టాలొచ్చాయి. విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయి. స్థానిక నేతల జోక్యం పెరిగింది.. మహిళలు ఇబ్బంది పడ్డారు.. ప్రస్తుతం కొందరే గేదెలను పెంచుతున్నారు. పాల ఉత్పత్తి సగానికి పడిపోయింది.!!

జనాలకు రూ.42 కోట్ల భారం

ఉదయం లేవగానే ప్రతి కుటుంబానికి గుర్తుకొచ్చేంది ‘పాలు’.. నాణ్యమైనవి ఎక్కడ దొరుకుతాయో అక్కడికి పరుగులు పెడతాం.. వాటిపైనా అనుమానమే.. చాలా మంది రైతు వద్ద కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. జగన్‌ జమానాలో ప్రోత్సాహం లేక ‘పాడి’ రైతుల సంఖ్య తగ్గింది.. జగన్‌ కక్ష వినియోగదారులకు శిక్షలా మారింది.. ఉమ్మడి జిల్లాలో నిత్యం రెండు లక్షల లీటర్ల పాల కొరత నెలకొంది.. ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్‌ పెరగడంతో లీటరు పాల ధర పెరిగింది.. ఉమ్మడి జిల్లా ప్రజలపై నెలకు రూ.42 కోట్ల అదనపు భారం పడింది.!!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదారు లక్షల మంది పాడి రైతులు ఉన్నారు. వైకాపా గద్దెనెక్కిన తర్వాత పాడి రంగాన్ని నిర్వీర్యం చేసింది. రాయితీలను ఎగ్గొట్టి పాడి రైతులపై పగబట్టింది. కర్నూలు జిల్లాలో పాలిచ్చే పశువులు 1.27 లక్షలు ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నా వాస్తవానికి 75 వేల పశువులే పాలిస్తున్నాయి. నంద్యాలలో 1.93 లక్షలు ఉన్నట్లు పేర్కొంటున్నా అందులో లక్ష వరకు పశువులే పాలిచ్చేవి ఉన్నాయి. ప్రస్తుతం కరవు పరిస్థితులు నెలకొన్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పచ్చిగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. పశుగ్రాసం ధరలు ఆకాశాన్నంటాయి. రాయితీపై లభించకపోవడంతో పాల ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది.

రాయితీలకు ఎగనామం

నాడు:  తెదేపా హయాంలో 50 శాతం రాయితీపై దాణా ఇచ్చేవారు. పాతర గడ్డిని ఏజెన్సీల ద్వారా తయారు చేయించి రైతులకు సరఫరా చేసేవారు. ఫలితంగా పాడి పశువులకు పోషకాలతో కూడిన ఆహారం అందేది. గతంలో రాయితీపై రెండు పశువులను ప్రభుత్వం అందించేది.

నేడు: వైకాపా హయాంలో మూడేళ్ల పాటు రాయితీ విత్తనాలు ఇవ్వలేదు. రాయితీ దాణా.. పాతర గడ్డి సరఫరా ఆపేసింది.  సీఎంఆర్‌ పేరుతో కొంతమందికి దాణా సరఫరా చేశారు. రైతులు కిలోకు రూ.6.50 చెల్లిస్తే ప్రభుత్వం కొంత సొమ్ము చెల్లించింది. అదీ అరకొరగానే జరిగింది. జగనన్న పాల వెల్లువ పథకాన్ని తెచ్చినా పాల ఉత్పత్తిలో పురోగతి లేదు. అమూల్‌ డెయిరీని తెచ్చి పాలు పోయాలని.. ఇలా పలు చర్యలు తీసుకున్నా ఆశించిన ఫలితం లేదు.

వాడిపోయిన పశుగ్రాస క్షేత్రాలు

నాడు: తెదేపా ప్రభుత్వం ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పథకాన్ని అమలు చేసింది. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి 75 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేసింది. భూమికి కౌలు, గడ్డి పెంపకం, నీటి తడులు, కోతలు.. ఇలా అన్నింటికీ వంద శాతం రాయితీ ఇచ్చి రైతులను ప్రోత్సహించింది. ఫలితంగా ప్రతి గ్రామంలో పచ్చిమేత అందుబాటులో ఉండేది.

నేడు: తెదేపా హయాంలో అమలు చేసిన పలు పథకాలను వైకాపా రద్దు చేసింది. అప్పటివరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు.

మినీ గోకులాలు పక్కన పెట్టారు

నాడు: ఎండలకు, వర్షాలకు పాడి గేదెలు, ఆవులు ఇబ్బందులు పడుతుండటంతో షెడ్ల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇచ్చింది. 2018లో పథకాన్ని ప్రారంభించి ఆసక్తి కలిగిన వారికి షెడ్లు మంజూరు చేసింది. 2 నుంచి 8 పశువుల వరకు ఉండేలా షెడ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది.

నేడు: వైకాపా వచ్చిన తర్వాత బిల్లులు ఇవ్వలేదు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి న్యాయస్థానాలకు  వెళ్లిన వారికే బిల్లులు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో రూ.3 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.

పడిపోయిన ఉత్పత్తి

  • ఏదైనా రంగం తీసుకుంటే ఏటేటా ఉత్పత్తి పెరగాలి. అందుకు తగ్గట్టు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి.. అధికార యంత్రంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. ఉత్పత్తి తగ్గిందని చెబితే ప్రభుత్వ పెద్దల నుంచి ఎక్కడ తలవంపులు వస్తాయోనని పాల ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించడం గమనార్హం. ఆ లెక్కల ప్రకారం తీసుకున్నా ఏటా తగ్గుతూ వస్తోంది. మొత్తంమీద పాల ఉత్పత్తి పడిపోయినట్లు ప్రభుత్వమే చెప్పకనే చెబుతుండటం గమనార్హం.

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు రోజువారీగా సుమారు 6 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయని పశు వైద్య శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నాలుగు లక్షల లీటర్ల ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. లీటరుకు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. పాలు, పాల పదార్థాల కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు నిత్యం రూ.1.40 కోట్లు వెచ్చిస్తున్నారు.. ఏడాదికి రూ.504 కోట్ల డబ్బులు ఇతర రాష్ట్రాల వ్యాపారులకు ధారబోయాల్సి వస్తోంది. ప్రభుత్వం పాడి రంగంపై దృష్టి పెట్టి ఉంటే కొరత తగ్గేది.. రైతులు బాగు పడేవారు.. వినియోగదారులకు నాణ్యమైన పాలు దొరికేవి.!!

బీమా.. డ్రామా

  • పాడి పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతే నష్టపోయిన పశు పోషకులకు వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం ద్వారా సాయం అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. 2022 డిసెంబరు నుంచి పథకాన్ని పూర్తిగా ఆపేసింది. 3,200 పాడి పశువులకు సంబంధించి రూ.5.50 కోట్ల నష్టపరిహారం రావాల్సి ఉంది.
  • 2023 జూన్‌లో పశుబీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో పశువులకు ఉచిత బీమా ఉండగా కొత్తగా అమలుచేస్తున్న పశుబీమా పథకంలో పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు పశువులకు రూ.390 వరకు ప్రీమియం చెల్లిస్తేనే నాటు పశువులకు రూ.15 వేలు, మేలు జాతి పశువులకు రూ.30 వేలు పరిహారం వస్తుంది. గతేడాది జూన్‌లో ప్రవేశపెట్టిన బీమా.. 2024 జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలుల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 500కు పైగా పశువులు చనిపోతే అందులో సగంవాటికి కూడా బీమా పరిహారం అందకపోవడం గమనార్హం.

ఇచ్చింది తక్కువ.. గొప్పలు ఎక్కువ

  • మొక్కజొన్న, జొన్న విత్తనాలను 75 శాతం రాయితీపై ఇస్తున్నట్లు చెబుతున్నా.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు వంద టన్నులు కూడా సరఫరా చేయలేదు. మిశ్రమ దాణా (టీఎంఆర్‌) 60 శాతం రాయితీపై, గడ్డి కత్తిరించే చాప్‌ కట్టర్లు ఇస్తున్నామని చెబుతున్నా అవి జిల్లాకు 50లోపే చేరుతున్నాయి.
  • గతంలో 50 కిలోల దాణా రూ.250కే ఇచ్చేవారు. ఇప్పుడేమో రూ.325గా చేశారు. అదీ నాణ్యత ఉండదు. పైగా రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ముందస్తుగానే నమోదు చేసుకోవాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పట్లో కరవు దాణా ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. సైలేజ్‌ గడ్డి తక్కువ ధరకే ఇచ్చేవారు. ఉపాధి హామీ పథకం కింద గడ్డి పెంపకం ఉండేది. ప్రసుత్తం అదీ లేదు. ఇలా ప్రభుత్వ తీరుతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

వైద్యం.. దైన్యం

రైతు భరోసా కేంద్రాలలో పాడి పశువులకు సంబంధించి 108 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు జగన్‌ సర్కారు గొప్పలు చెబుతోంది. అందులో 10 శాతం మందులు కూడా ఆర్బీకేలకు చేరలేదు. ఏవైనా మందులు, టీకాలు అవసరమైతే బయట కొనుగోలు చేయాలని పాడి రైతులకు పశుసంవర్ధక సహాయకులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని