logo

బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి

రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఆదేశించింది.

Published : 18 May 2024 01:50 IST

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఆదేశించింది. కర్నూలు జిల్లా గూడూరు మండలానికి చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ ఓంప్రకాశ్‌ 2021 నుంచి 2024 వరకు చెల్లుబాటయ్యేలా ఆదిత్య బీమా సంస్థ నుంచి రూ.25 లక్షల బీమా పాలసీ తీసుకున్నారు. అదే సంవత్సరం అక్టోబరు 4వ తేదీన మరో ఇద్దరు మిత్రులతో కలిసి మోటారు సైకిల్‌పై ఓంప్రకాశ్‌ వెళ్తుండగా అకస్మాత్తుగా పంది అడ్డు రావటంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధమంటూ బీమా పరిహారం ఇచ్చేందుకు ఆదిత్యబిర్లా సంస్థ నిరాకరించటంతో బాధిత కుటుంబసభ్యులు కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను కమిషన్‌ అధ్యక్షులు కరణం కిషోర్‌కుమార్‌, సభ్యులు నారాయణరెడ్డి, నజీమకౌసర్‌తో కూడిన బెంచి శుక్రవారం పరిశీలించింది. ముగ్గురు ప్రయాణించటంతో ప్రమాదం జరగలేదని, పంది అడ్డు రావటంతోనే జరిగిందని పేర్కొంటూ బీమా పరిహారం రూ.25 లక్షలతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.50 వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.

పరిహారం ఇవ్వాల్సిందే

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : అగ్నిప్రమాదానికి సంబంధించిన ఘటనలో ప్రమాద బీమా పరిహారం చెల్లించాలంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఆదోని పట్టణానికి చెందిన సభాకౌసర్‌ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2019 సంవత్సరంలో రూ.25 లక్షలతో పవర్‌లూమ్‌, హ్యాండ్‌లూమ్‌ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. చోళమండలం జనరల్‌ ఇన్సురెన్స్‌ సంస్థ వద్ద రూ.15 లక్షలకు ప్రమాద బీమా తీసుకున్నారు. 2020, అక్టోబరు 30న కురిసిన భారీ వర్షంతో సంస్థ ఆవరణలోకి భారీగా నీరు చేరటంతో విద్యుదాఘాతం చోటుచేసుకుని అగ్నిప్రమాదం జరిగింది. యంత్రాలు కాలిపోవటంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రమాద ఘటనను ధ్రువీకరించారు. బాధితులు పరిహారం కోరుతూ బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోగా సదరు బీమా సంస్థ సర్వేయర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.1.75 లక్షలు మాత్రమే నష్టం జరిగినట్లు నివేదిక అందించారు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్‌ అధ్యక్షులు కరణంకిషోర్‌కుమార్‌, సభ్యులు నారాయణరెడ్డి, నజీమాకౌసర్‌తో కూడిన బెంచి సంస్థ యజమానికి రూ.7.5 లక్షలను 9 శాతం వడ్డీతో చెల్లించటంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.60 వేలు ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని