logo

లాడ్జిలపై ఏదీ నిఘా?

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

Updated : 03 May 2024 05:40 IST

యాదగిరిగుట్ట పట్టణం

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ లాడ్జిలో చనిపోవడం, అతని సంబంధించిన ఆధారాలు, అతనితో వచ్చిన వ్యక్తుల ఆధారాలు రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడం, కనీసం సీసీ కెమెరాల ఫుటేజీ లేకపోవడాన్ని బట్టి లాడ్జి నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది.

నిబంధనలు ఇవి..

యాదాద్రి దేవస్థానం అభివృద్ధి కావడం, భక్తుల సంఖ్య పెరగడంతో వారికి అనుగుణంగా పట్టణంలో ప్రైవేటు లాడ్జిలు అనేకం పుట్టుకొచ్చాయి. మొత్తం 86 ఉండగా మరికొన్ని నివాసాల్లోనే కొన్ని గదులను అద్దెకు ఇచ్చి నిర్వహించే వారున్నారు. భక్తులైన, సాధారణ పౌరులైన లాడ్జిలో చేరే ముందు వారి ఆధార్‌ కార్డు,  ఇతర గుర్తింపు కార్డుల ద్వారా వివరాలను, చరవాణి సంఖ్యను నమోదు చేసుకోవాలి. అవసరమైతే గుర్తింపు కార్డు నకలు స్వీకరించాలి. గదులు మినహా కౌంటర్‌, వెలుపల ఆయా ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఉగ్రవాదులు, అనుమానాస్పద వ్యక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు గదులను అద్దెకు ఇవ్వకూడదు. సందేహంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వ్యభిచారులు, విటులు, అక్రమ సంబంధికులకు ఎట్టి పరిస్థితిలో గదులు ఇవ్వొద్దు. చుట్టూ ఉన్న ఆవాసులకు ఇబ్బందులు కలిగించొద్దు వంటి నిబంధనలతో లాడ్జిల నిర్వహణ చేపట్టాలి. లాడ్జిల నిర్వహణపై పోలీసుల సరైన నిఘా లేకపోవడంతో ఈ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


నిబంధనలు పాటించకుంటే సీజ్‌ చేస్తాం

- రమేశ్‌, సీఐ, యాదగిరిగుట్ట ఠాణా.

ప్రతీ లాడ్జి యజమానులు రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. రోజుకు ఎంత మంది వచ్చారో, ఆ వివరాల జాబితాను ఠాణాలో ఇవ్వాలి. దీనిపై లాడ్జి నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నాం. నిబంధనలు పాటించకుంటే సీజ్‌ చేస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని