logo

అన్విత మరో సాహసం

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్‌) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది.

Updated : 17 May 2024 03:21 IST

దెనాలి పర్వతారోహణకు పయనం

అన్విత​​​​​​

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్‌) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లి గ్రామానికి చెందిన అన్విత శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలు దేరి 20న ఉదయం అలాస్కా విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తన గైడ్‌ సహాయంతో పర్వతం వద్దకు చేరుకుంటుంది. పర్వతం రూట్‌ని పరిశీలిస్తారు. వాతావరణ అనుకూలతను బట్టి పర్వతారోహణ ప్రారంభిస్తారు. జూన్‌ 4 నుంచి 10 లోపుగా పూర్తి చేయాలనేది లక్ష్యం. గత పర్వతాలు అధిరోహిస్తున్న సమయంలో సామగ్రి మోసుకెళ్లేందుకు పొటెన్‌(సహాయకుడు)ఉండేవారు. ప్రస్తుతం స్వయంగా 70 కిలోల బరువును భుజాన వేసుకొని ఎత్తైన శిఖరం అధిరోహించాలి.

ప్రస్థానం ఇలా..

అర్జున్‌ అవార్డు గ్రహీత పర్వతారోహకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో భువనగిరి ఖిల్లా పక్కన స్థాపించిన రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ ద్వారా 2014లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పర్వతారోహణపై శిక్షణ ఇచ్చారు. అదే సంవత్సరంలో ఈయన శిష్యరికంలో శిక్షణ పొందిన పూర్ణ, ఆనంద్‌లు అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులుగా రికార్డు సాధించారు. అదే సమయంలో వార్తాపత్రికల్లో పర్వతారోహకుల కథనాలు చూసి ప్రేరణ కలిగి తల్లిదండ్రులకు చెప్పకుండా శేఖర్‌బాబును కలిసి తన అభిలాషను తెలిపింది. అతను తల్లిదండ్రులను పిలిచి ఒప్పించి శిష్యురాలిగా చేర్చుకున్నారు. అదే సంవత్సరంలో బేసిక్‌ కోర్సు, 2019లో అడ్వాన్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. పర్వతారోహణకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం, మెలకువలు తెలుసుకున్నారు. ఇలా సాగిన ఆమె ప్రస్థానం ఆమె లక్ష్యాన్ని చేరుకునేందుకు చేరువలో నిలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని