logo

అక్రమ సాగు పట్టదరొయ్యా!

డాలర్ల పంటగా గుర్తింపు పొందిన రొయ్యల సాగు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉంది. వీరిలో ఎంతోమంది సాగుదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి చెరువులుగా మారుస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారీతిన పెంచుతున్నారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని భూ

Published : 20 May 2022 01:44 IST

ఈచిత్రంలో మత్స్య శాఖ కావలి సహాయ సంచాలకుని పరిధిలో ఉలవపాళ్ల గ్రామ సమీపంలో అక్రమంగా సాగవుతున్న రొయ్యల చెరువు. ఏడాదిన్నరగా సాగు చేస్తున్నా నోటీసులు కూడా ఇవ్వలేదు. పక్కనే పచ్చని పంట పొలాలు ఉన్నాయి.

న్యూస్‌టుడే, కావలి : డాలర్ల పంటగా గుర్తింపు పొందిన రొయ్యల సాగు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉంది. వీరిలో ఎంతోమంది సాగుదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి చెరువులుగా మారుస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారీతిన పెంచుతున్నారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని భూములు కలుషితమవుతున్నాయి. నిస్సారంగా మారి సాగుకు పనికిరావడం లేదని రైతులు వాపోతున్నారు. తీరప్రాంతంలో సముద్ర జలాలు విషతుల్యంగా మారుతున్నాయి. అధికారులకు తెలిసినా కళ్లుండీ చూడలేకపోతున్నారు.

అనుమతుల్లేని వాటిపై చర్యలేవీ?

అనుమతుల్లేని రొయ్యల సాగుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. ఇందుకోసం ఆక్వా కల్చర్‌ అభివృద్ధి అథారిటీ చట్టం -2020 తీసుకొచ్చింది. ఎవరైనా కొత్తగా సాగు చేయాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేశారు. రెండు హెక్టార్లలోపు వారికి మండల స్థాయిలో, ఆపై విస్తీర్ణంలో ఉంటే రాష్ట్ర కార్యదర్శి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. పాత సాగుదారులు కూడా విధిగా అనుమతులు పొందాలి. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా సాగును గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా అక్రమాలు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు.

తీరానికి 200 మీటర్లకు పైనే..

సముద్ర తీర ప్రాంతానికి 200 మీటర్లు, సంప్రదాయ పంటలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి.గత మార్చి నెలాఖరుతోనే ఆప్సడా కింద అనుమతులు పొందాలని నిర్దేశించారు. కానీ ఇవేమీ పాటించడం లేదు. పంట పొలాలు, సముద్రం, పెన్నా నది గర్భంలో చెరువులు ఉన్నాయి.

తీరమే అడ్డా

సముద్ర తీర ప్రాంతంపై నిఘా లేకపోవడం అక్రమసాగుదారులకు వరంగా మారింది. కావల్సిన మేరకు కబ్జా చేసి గుంతలుగా మారుస్తున్నారు. మనుబోలు మండలం నుంచి ఉలవపాడు వరకు వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యల సాగు ఉంది. ఇందులో అనుమతి లేనివే ఎక్కువ. మత్స్యశాఖ అధికారులు మాత్రం పదో వంతు కూడా గుర్తించడం లేదు. కోస్తా ప్రాంతంలో ఉండే మడ అడవులను నరికి సాగు చేస్తున్నా, అటవీ శాఖ నుంచి అభ్యంతరాలుండవు. దేవాదాయ భూములు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పోరంబోకు భూముల్లో కూడా నిబంధనలను ఉల్లంఘించి సాగు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పెన్నా నదికి ఇరువైపులా మండలాల్లో అనుమతి లేని రొయ్యల సాగు భారీగా ఉంది. వీరి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇది కావలి మండలంలో రొయ్యల సాగు నిమిత్తం సన్నద్ధం చేస్తున్న గుంత. ఇది కొత్తసత్రం, రెడ్డిపాళెం గ్రామాల నడుమ వివాదానికి కారణమైంది. అనుమతి లేని సాగును సహించబోమని రెడ్డిపాళెం వాసులు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని కొత్తసత్రం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

నియంత్రిస్తాం : నాగేశ్వరరావు, సంయుక్త సంచాలకులు, మత్స్య శాఖ

నధికారిక రొయ్యల సాగును నియంత్రిస్తాం. ఈనెలాఖరులోగా అప్సడాలో అనుమతులు పొందాలి. అనుమతులుంటేనే విద్యుత్తు సరఫరాలో రాయితీ అందుతుంది. అనుమతుల మంజూరు అనేది నిరంతరం సాగే ప్రక్రియ.

ఇదీ పరిస్థితి

జిల్లాలో మొత్తం మండలాలు : 38

రొయ్యల సాగు జరిగేది: 26

అనుమతులు తీసుకున్నవారు : 3,000

అనుమతి పొందిన విస్తీర్ణం: 9,700 ఎకరాలు

ఉల్లంగించిన వారు: 90 మంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని