logo

జగన్‌ సర్కార్‌ ఉత్తుత్తి సాయం

మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది.

Published : 27 Apr 2024 03:19 IST

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. తెదేపా ప్రభుత్వం మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఎంతో మంది శిక్షణ పొందారు. స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఆ దిశగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించలేదని వారు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత కింద గత నాలుగేళ్లుగా ఆర్థిక సాయం అందించగా గతేడాది 2,241 మంది ఖాతాలకు జమ చేసింది. ఈ ఏడాది సీఎం బటన్‌ నొక్కినా ఇంకా సాయం అందలేదంటున్నారు. ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం పలు రకాల శిక్షణలు మహిళలకు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పలు రకాల చిరువ్యాపారులు, చేతివృత్తి పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మండలంలో సుమారు 1500 మందికి పైగా ఉండగా చాలా మందికి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదనే విమర్శలున్నాయి.

చేతివృత్తిదారులకు రిక్తహస్తం

ఉలవపాడు : మండలంలో చేతివృత్తుల వాళ్లకు పరికరాల పంపిణీ ఊసేలేదు. బీసీలు కొందరు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. వారికి గత ప్రభుత్వాలు వాళ్లవృత్తిని బట్టి అవసరమైన పరికరాలు అందించాయి. కానీ, జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దర్జీలకు, చేనేత కార్మికుల నాయీబ్రాహ్మణులకు, వడ్రంగులకు ఇతర చేతివృతులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఎలాంటి సాయం చేయలేదు. మండలంలో కొన్ని గ్రామాల్లో కొందరికి.. తమ ఖాతాలో నగదు జమ చేశారని చెబుతున్నా.. అది పిసరంతే.


రుణాలివ్వలేదు.. పరికరాలందలేదు

మాలకొండయ్య, గుడ్లూరు

నాయీబ్రాహ్మణులం. గతంలో రుణాలిచ్చేవారు. ఇప్పుడు అలాంటివి లేవు. చేతివృత్తులతో జీవనం సాగించడం కష్టంగా ఉంది. వాయిద్య పరికరాల కొనుగోలుకు రాయితీ ఇవ్వాలి. తెదేపా ప్రభుత్వం ఆదరణ పథకంతో చేతి వృత్తులను ఆదుకుంది. ప్రభుత్వం ఆదరించకపోవడంతో కులవృత్తులను వదిలేయాల్సి వస్తోంది.


ఎలాంటి సాయం అందలేదు

సుబ్బారావు, కొలిమిపని కార్మికుడు

మేము కొలిమిపని ఇనుప వస్తువులు తయారు చేస్తుంటాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం, రుణాలు అందలేదు. కేవలం శారీరక శ్రమతో జీవిస్తున్నాం. వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రుణం ఇస్తే ఇనుప వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని