logo

వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం

అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...

Published : 27 Apr 2024 03:14 IST

ఆల్తుర్తి వద్ద పైపుల ఆధారంతో ప్రమాదకరంగా ఉన్న వంతెన

అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి... ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాలతో పాటు  రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో వైకాపా ప్రభుత్వం ఒక్క వంతెన నిర్మించ లేదు. కనీసం మరమ్మతులు చేయకుండా వదిలేశారు... రక్షణ గోడలు లేక, గుంతలు పడి, రాళ్లు తేలి చప్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి..


నావూరుపల్లి వాగుపై వంతెన లేక నడిచి వెళుతున్న గ్రామస్థులు (పాతచిత్రం)

పొదలకూరు:  సర్వేపల్లి నియోజకవర్గంలో వర్షాకాలంలో వాగులపై వంతెనలు లేక ఇబ్బందులు పడుతుండగా కొన్ని శిథిలావస్థకు చేరాయి. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో వాగుల వద్ద వంతెనల దుస్థితిపై ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పొదలకూరు మండలంలో ఆల్తుర్తి వద్ద వంతెనకు కొన్ని చోట్ల రంధ్రాలు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులు చేసి సరిపెట్టారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.  నిధులు మంజూరయ్యాయని అధికారులు ప్రకటించారు. డైవర్షన్‌  ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పనులు చేపట్టకపోవడంతో ఎదురుచూపులే మిగిలాయి. దీంతోపాటు నావూరు పెద్దవాగు, వాగుపై ఉద్ధృతిగా నీరు ప్రవహిస్తోంది. వీటిపై వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నా ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వర్షాకాలంలో వాగు దాటి చిన్నారులతో వెళుతున్నామని మాగోడు వినేవారేలేరని గ్రామస్థులు వాపోతున్నారు. పొదలకూరు-రాపూరు ప్రధాన రహదారిపై ఉండే డేగపూడి వంతెన శిథిలావస్థకు చేరుకుంది.  వర్షాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది.  


ఆత్మకూరు గ్రామీణం: ఆత్మకూరు నియోజకవర్గంలోని అనుమసముద్రంపేట, అనంతసాగరం, సంగం, చేజర్ల, మర్రిపాడు మండలాల్లో వర్షాలు పడితే పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. మర్రిపాడు మండలంలోని సన్నోరుపల్లి, భీమవరం వద్ద బొగ్గేరుపై నిర్మించిన చప్టాలకు, పి.ఎన్‌.పల్లి, చుంచులూరు వద్ద కేతామన్నేరుపై నిర్మించిన వంతెనలకు రక్షణ దిమ్మెలు లేవు. వర్షాకాలం చప్టాపై నీరు ప్రవహించే సమయంలో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాకపోకలు సాగించే సమయంలో కొందరు అదుపు తప్పి కింద పడిన సంఘటనలున్నాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గతంలో బొగ్గేరు చప్టాను పరిశీలించి ఎత్తు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.


విడవలూరు: కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు, విడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట మండలాల్లో వంతెనలు కూలిపోయేలా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వర్షాలకు కూలిపోయిన వాటిని సైతం కనీసం నిర్మాణ పనులు చేపట్టలేదు.  ః విడవలూరు మండలంలోని ఊటుకూరు-పల్లిపాలెం వద్ద చింతపండేరుపై వంతెన నాలుగేళ్ల క్రితం వచ్చిన వరదలకు కూలిపోయింది. వైకాపా పాలనలో ఇప్పటి వరకు నిర్మించలేదు. తాత్కాలికంగా మట్టితో చదునుచేసి వదిలేశారు. మళ్లీ వరదలొస్తే మట్టి కొట్టుకుపోవడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ః ముదివర్తిలో మలిదేవి వాగుపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వంతెన చేపట్టు గోడలు విరిగిపోయాయి. వంతెన పగుళ్లిచ్చి కూలేందుకు సిద్ధంగా ఉంది. ః విడవలూరులోని జాన్‌పేట వద్ద మలిదేవి డ్రెయిన్‌పై వంతెన ప్రమాదకరంగా ఉంది. వర్షా కాలంలో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ః గాదెలదిన్నె వద్ద పైడేరుపై వంతెన నిర్మించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ః ముదివర్తి-ముదివర్తిపాలెం మద్య పెన్నానదిపై కాజ్వే నిర్మాణం పూర్తి చేస్తానన్న వైకాపా ప్రభుత్వం దాని ఊసే విస్మరించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు