logo

ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం జిల్లాలో మొదలైంది. కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియ అక్టోబరు 1వతేదీ(శనివారం) నుంచి ప్రారంభమైంది.

Published : 02 Oct 2022 02:03 IST

ప్రారంభమైన ఓటర్ల నమోదు ప్రక్రియ

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: జడ్పీ, న్యూస్‌టుడే: తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం జిల్లాలో మొదలైంది. కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియ అక్టోబరు 1వతేదీ(శనివారం) నుంచి ప్రారంభమైంది. ఆ మేరకు కలెక్టర్‌.. ఓటరు నమోదు రిజిస్ట్రేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకునేందుకు తమ పరిధిలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వైకాపా, తెదేపా అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

గతంలో నమోదైన ఓట్లు రద్దు
జిల్లాలో 2017లో శాసన మండలి ఎన్నికలు జరిగాయి. అప్పటి ఓటర్ల జాబితా ప్రకారం.. దాదాపు 64 వేల మంది పట్టభద్రులు, ఉపాధ్యాయలు ఉన్నారు. వాటిని రద్దు చేశారు. వీరితో పాటు.. కొత్తవారు ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇందుకు పట్టభద్రులు ఫారం-18, ఉపాధ్యాయులు ఫారం-19ను
www.ceoandhra.nic.in వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా చిత్తూరు జిల్లా డీఆర్వో వ్యవహరిస్తుండగా- మిగిలిన జిల్లాల డీఆర్వోలు అదనపుఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రక్రియలో దాదాపు మూడు జిల్లాలకు చెందిన 258 మంది అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. నవంబరు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాత జిల్లా లెక్కల ప్రకారం 46 మండలాల పరిధిలో దాదాపు లక్ష మంది వరకు ఓటు కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇంటి చిరునామా, 2019 అక్టోబరు 31 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు గెజిటెడ్‌ అధికారులు ధ్రువీకరించిన డిగ్రీ మార్కుల జాబితా జిరాక్స్‌ కాపీలను దరఖాస్తుకు జతచేయాలి. పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటో అందజేయాలి. దరఖాస్తులో ఆధార్‌ సంఖ్యను నమోదు చేయాలి. ఏక మొత్తం(బల్క్‌గా) దరఖాస్తులను స్వీకరించరు. ఒకే చిరునామాలో నలుగురైదుగురు ఉంటే అవన్నీ ఒకరు అందజేయవచ్చు.

రంగంలోకి రాజకీయ పార్టీలు .. అధికార వైకాపాతో పాటు తెదేపా, వామపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైకాపాలో పట్టభద్రుల అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి.చంద్రశేఖర్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ పేరును ఖరారు చేశారు. ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. వామపక్షాల నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి మూడుసార్లు మాత్రమే అధికార పగ్గాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈసారి కొత్తవారిని ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఆదివారం తుది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని