logo

ఫలితాలపై పందేల జోరు!

ఓ వైపు ఐపీఎల్‌ బెట్టింగ్‌ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు.

Updated : 17 May 2024 05:14 IST

కూటమి గెలుస్తుందని పెట్టే వారిలో జోష్‌
అంతా గుట్టుగా జరుగుతున్న వ్యవహారం

ఈనాడు, నెల్లూరు: ఓ వైపు ఐపీఎల్‌ బెట్టింగ్‌ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. బెట్టింగ్‌ కేంద్రాలను తెరిచేశారు. పార్టీల వారీగా సాధించే స్థానాలు, ఆధిక్యాలు, ఎన్నిచోట్ల గెలిచే అవకాశం ఉంది? కీలక స్థానాల్లో ఎవరు గెలుస్తారనే అంశాలపై ప్రధానంగా బెట్టింగ్‌లు మొదలయ్యాయి. నగర కేంద్రంగా బడాబాబులు మొత్తం బెట్టింగ్‌ రాయుళ్లుగా మారిపోగా- ఇప్పటికే రూ. కోట్లలోనే పందేలు జరిగినట్లు సమాచారం. ఇక్కడ కూటమి మద్దతుదారులు ఎక్కువగా ఒకటికి ఒకటిన్నర రెట్లు ఇచ్చేందుకు సిద్ధపడగా- మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి రూపాయికి రూపాయి చొప్పున బెట్టింగ్‌ కడుతున్నారు. ఓట్ల లెక్కింపు తేదీలు దగ్గరపడే కొద్దీ.. రూపాయికి రెండు రూపాయిలు కాసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నా.. పోలీసుశాఖ ఇప్పటికీ ఆ వైపు దృష్టిసారించలేదు. ఓట్ల లెక్కింపు తేదీ వచ్చేటప్పటికి జిల్లాలో వివిధ రూపాల్లో రూ. వందల కోట్లలోనే చేతులు మారే అవకాశం ఉందని సమాచారం.

ముందస్తు పత్రాలు రాసుకుంటూ...

జిల్లాలో వివిధ పార్టీల తరఫున ముఖ్య నాయకులుగా ఉన్న కొందరే.. బెట్టింగ్‌ నిర్వాహకులుగా ఉన్నారు. నెల్లూరు నగరంతో పాటు కందుకూరు, కావలి కేంద్రంగా నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్దేశిత ప్రాంతాల్లో కోలాహలం మొదలవగా.. బెట్టింగ్‌కు ముందుకు వచ్చిన నాయకులు ఒక ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు. ఆపై ఇద్దరూ కలిసి ఓ నమ్మకమైన నేత దగ్గర ఆ మొత్తం ఉంచుతున్నారు. ఫలితం తేలిన తర్వాత.. ఒప్పందం ఆధారంగా నగదు ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు మాట ఆధారంగా.. మధ్యవర్తిపై నమ్మకం ఉంచి.. పందేలు కాస్తున్నారు. ఈ క్రమంలో సదరు మధ్యవర్తికి పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం కమిషన్‌ రూపంలో ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

స్థానాలు.. మెజారిటీలు

జిల్లాలోని రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన మరుసటి రోజు నుంచే పార్టీల వారీగా రాజకీయ నిపుణులు లెక్కలు వేయడానికి రంగంలోకి దిగారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. బూత్‌ల వారీగా ఎవరికి మద్దతు ఉంటుందనే దానిపై సమాచారం సేకరించారు. అవన్నీ క్రోడీకరించుకుని ఓ అంచనాకు వచ్చారు. నియోజకవర్గాల వారీగా ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై తేల్చి.. బెట్టింగ్‌ కోసం పిలుస్తున్నారు. ప్రధాన పార్టీలు సాధించే సీట్లు.. జిల్లాలో కీలకమైన నాయకులు బరిలో ఉన్న స్థానాలు, అభ్యర్థులు సాధించే మెజారిటీ ఆధారంగా పందేలు జోరుగా సాగుతున్నాయి.


‘రెండు ప్రధాన పార్టీలు సాధించే సీట్ల సంఖ్య ఆధారంగా ఎక్కువ శాతం బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి ఎవరు? అనేది కూడా కీలకంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బెట్టింగ్‌కు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండగా.. పార్టీకి వచ్చే మెజారిటీపైనా పందేలు ఎక్కువగానే కడుతున్నారు.’


సర్వేపల్లి నియోజకవర్గంలోనూ రెండు ప్రధాన పార్టీల గెలుపోటములపైనా భారీగా పందేల జోరు నెలకొనగా- కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాలపై ఇరుపార్టీల వారు పందేలకు సిద్ధపడుతుండగా- ఆత్మకూరులో మాత్రం కూటమివైపు కాస్తున్నా.. రెండో వైపు నుంచి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని