logo

అసలేం జరుగుతోంది?

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరోసారి అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ స్థానంలో తాత్కాలికంగా ఆచార్య విద్యావర్ధిణిని నియమిస్తూ వీసీ ఆచార్య రవీందర్‌ బుధవారం

Updated : 18 Aug 2022 04:49 IST

మళ్లీ తెవివి రిజిస్ట్రార్‌ మార్పు

ఆచార్య విద్యావర్ధిణికి బాధ్యతలు

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరోసారి అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ స్థానంలో తాత్కాలికంగా ఆచార్య విద్యావర్ధిణిని నియమిస్తూ వీసీ ఆచార్య రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

గతేడాది మేలో వీసీగా వచ్చినప్పటి నుంచి ఆయన నలుగురు రిజిస్ట్రార్లను మార్చారు. వర్సిటీ ఆవిర్భావం నుంచి ముగ్గురు శాశ్వత వీసీలు పనిచేసినా ఇంత మందిని ఎప్పుడు మార్చలేదు. ప్రస్తుత వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి తనకు నచ్చిన ఆచార్యుడిని రిజిస్ట్రార్‌గా నియమించుకునే అధికారం వీసీకి ఉంటుంది. కానీ, స్వల్ప కాలంలోనే నలుగురిని మార్చడం వెనుక కారణాలు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆచార్య విద్యావర్ధిణికి నియామక ఉత్తర్వు ఇస్తున్న వీసీ ఆచార్య రవీందర్‌

వెంట వెంటనే..

తరచూ రిజిస్ట్రార్లను మార్చడంతో తెవివికి చెడ్డపేరు వస్తోందని వర్సిటీ ఆచార్యులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. 2021 మేలో వీసీ రవీందర్‌ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో నసీం రిజిస్ట్రార్‌గా ఉన్నారు. సెప్టెంబరు 1న ఆమెను తప్పించారు. ఆచార్య కనకయ్యను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. గతేడాది అక్టోబరు 30న జరిగిన పాలకమండలి సమావేశంలో ఆయన నియామకం తిరస్కరణకు గురైంది. వెంటనే ఆచార్య యాదగిరికి బాధ్యతలు ఇచ్చారు. 40 రోజులకే ఆయణ్ని తప్పించి.. డిసెంబరు 9న శివశంకర్‌ను నియమించారు.

సయోధ్య లేక..

పాలకమండలి సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ యాదగిరిని స్వయంగా నియమించారు. ఆయణ్ని కాదని శివశంకర్‌ను వీసీ తీసుకొచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య ఉంటుందని అంతా భావించారు. కానీ, పలు అంశాల్లో వీసీకి, రిజిస్ట్రార్‌కు మధ్య పొసగట్లేదని సమాచారం. అయితే శివశంకర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పాలక మండలి(ఈసీ) సమావేశం జరగలేదు. ఇంతలోనే విద్యావర్ధిణికి బాధ్యతలు అప్పగించారు.

సెలవుల్లో ఉండగానే..

రిజిస్ట్రార్‌ శివశంకర్‌ వ్యక్తిగత పనుల్లో భాగంగా సెలవుల్లో ఉన్నారు. ఈలోగానే మార్పు జరగడం గమనార్హం. తాత్కాలిక రిజిస్ట్రార్‌గా ఎవరినైనా నియమించుకొనే అధికారం వీసీకి ఉన్నప్పటికీ.. దాన్ని పాలకమండలిలో పెట్టి ఆమోదం పొందితే ఏడాది కాలం పొడిగించుకునే అవకాశం ఉంటుంది. శివశంకర్‌ సెలవుల నుంచి తిరిగొచ్చిన తర్వాత విద్యావర్ధిణి బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే 2014 రిక్రూట్‌మెంట్‌ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ నియామకంలోనే ఉన్న ఆచార్య కనకయ్యను రిజిస్ట్రార్‌గా తీసుకోవడంపై గతంలో వర్సిటీలో జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 2014లోనే నియామకమైన విదావర్ధిణిని ఈసీ సభ్యులు ఆమోదిస్తారా? అనే సందేహం విద్యార్థి సంఘాలు వ్యక్తపరుస్తున్నాయి.

ఆందోళనలో భాగంగా వీసీ నివాసగృహం ఎదుట భోజనం చేస్తున్న విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని