logo

ఆకాశవాణి మీకోసం..

పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి.

Updated : 19 Apr 2024 06:19 IST

 న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌
యాప్‌లో పిల్లల ప్రసారాలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

  నిజామాబాద్‌ ఆకాశవాణి కేంద్రం

పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. అమ్మానాన్నలకి పనుల్లో సహకారం అందిస్తూ.. మీకిష్టమైన పాటలు, పెద్దల సూక్తులు, పద్యపఠనాలు వినే అవకాశాన్ని అందిస్తుంది నిజామాబాద్‌ ఆకాశవాణి. సినీగీతాలు.. వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నీతికథలు ఆడుతూ పాడుతూ వినొచ్చు. మరి మా ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలని ఆందోళన ఎందుకు? మీ అరచేతిలో ఉన్న చరవాణి సరిపోతుందిగా. అవునూ.. ఆకాశవాణి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌తో జిల్లా, రాష్ట్రం, దేశవిదేశాల్లో ఎక్కడున్నా.. జిల్లా సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లేస్టోర్‌లో న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రేడియో ఛానల్స్‌లో భాషతో పాటు ఆకాశవాణి కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. లైవ్‌ రేడియో క్లిక్‌ చేయగానే ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. ఉదయం 5.53 నుంచి రాత్రి 11.10 వరకు వివిధ అంశాలపై ప్రసారాలు కొనసాగుతుంటాయి. అలాగే నిజామాబాద్‌ ఆకాశవాణి పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌లో ఎప్పటికప్పుడు వైవిధ్య కార్యక్రమాలు పొందుపరుస్తున్నారు.

100కి.మీల పరిధిలో ప్రసారాలు..

నిజామాబాద్‌ ఆకాశవాణి ఎఫ్‌ఎం కేంద్రాన్ని జిల్లాకేంద్రం న్యాల్‌కల్‌రోడ్‌లో 1990 సెప్టెంబర్‌ 9న అప్పటి కేంద్ర మంత్రి ఉపేంద్ర ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాకు చెందిన అన్నివర్గాల వివిధ కార్యక్రమాలు ప్రసారం చేస్తూనే ఉన్నారు. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రసారాలు వినిపించేవి. ఇటీవల అమర్చిన 10 కిలో వాట్స్‌ ప్రభావంతో 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం వరకు అందుతున్నాయి. ఆకాశవాణి ప్రసారాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డితో పాటు మహారాష్ట్ర నాందేడ్‌, నిర్మల్‌, జన్నారం, జగిత్యాల జిల్లా కోరుట్ల వరకు సేవలు అందుతున్నాయి.

చిన్నారుల కోసం బాలభారతి.

ఇందులో ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక, జానపద కళారూపాలు, వ్యక్తిత్వ వికాసం, వైద్యసలహాలు వంటి ప్రసారాలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం ప్రతి ఆదివారం ఉదయం 8.30కి బాలభారతి, చిన్నారి లోకం, మహనీయుల స్ఫూర్తిదాయక ప్రసంగాలను ప్రసారం చేస్తున్నారు. నిత్యం ఉదయం 6 నుంచి 6.40 వరకు సూక్తిసుధ, భక్తిరంజనీ తదితర ప్రసారాలు చేపడుతున్నారు.


ఎంతో ఉపయోగపడతాయి

- వీపీ చందన్‌రావు, ప్రముఖ కవి, నిజామాబాద్‌

గతంలో ఆకాశవాణిలో ప్రసారమయ్యే బాలానందం పిల్లలతో పాటు పెద్దలు అందరూ ఇష్టంగా వినేవారు. వేసవిలో ఇంట్లో ఉండే పిల్లలకు కాలక్షేపంతో పాటు వ్యక్తిత్వ వికాసం, భాష, పఠనంపై ఆసక్తి పెంచేందుకు ఆకాశవాణి ప్రసారాలు ఎంతో ఉపయోగపడుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని