logo

నిప్పుల కొలిమిలా రాష్ట్రం

రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి.

Updated : 20 Apr 2024 06:55 IST

బౌద్ధ్‌ @ 44.3 డిగ్రీలు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. ఎండల తీవ్రత, గాడ్పులతో 11 గంటల నుంచి 3 వరకు ప్రధాన నగరాలు, పట్టణాలు వెలవెలబోతున్నాయి ప్రజలు గడప దాటలేని పరిస్థితి కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉంటోంది. గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ శుక్రవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... బౌద్ధ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో మరో 30 కేంద్రాల్లో 40 నుంచి 42 డిగ్రీలుగా ఉందన్నారు.

ప్రత్యేక హెచ్చరికలు

శనివారం మయూర్‌భంజ్‌, నయాగఢ్‌, అనుగుల్‌, బౌద్ధ్‌, ఝార్సుగుడ, సుందర్‌గఢ్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నాయని, గాడ్పుల తీవ్రత ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. బాలేశ్వర్‌, భద్రక్‌, జగత్సింగ్‌పూర్‌, కేంఝర్‌, ఢెంకనాల్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, కటక్‌, ఖుర్దా, కొంధమాల్‌, గజపతి, గంజాం, కొరాపుట్‌, సంబల్‌పూర్‌, దేవ్‌గఢ్‌, మల్కాన్‌గిరి, నవరంగపూర్‌, బొలంగీర్‌, బరగఢ్‌, సోన్‌పూర్‌ జిల్లాల్లోనూ గాడ్పులు వీస్తాయని వివరించారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. 21, 22 తేదీల్లో అక్కడక్కడా కాలవైశాఖి స్వల్ప ప్రభావం చూపినా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర, పశ్చిమ దిశగా గాడ్పులు రాష్ట్రాన్ని నేరుగా తాకుతున్నందున ఎండల తీవ్రత కొనసాగుతుందని దాస్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని