logo

మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం

ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్‌ సమితి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

Published : 20 Apr 2024 02:46 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్‌ సమితి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. కొట్టుకుపోయినవారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంత మత్స్యకారులు 41 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బరగఢ్‌ జిల్లా బంజిపల్లికి పిక్నిక్‌ కోసం లఖన్‌పూర్‌ సరిహద్దు నుంచి 50 మంది పడవలో వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణ సమయంలో అదుపు తప్పిన పడవ మునిగింది. ఇక్కడ చేపలు వేటాడుతున్న మత్స్యకారులు 41 మందిని రక్షించి తమ పడవల్లో ఒడ్డుకు చేర్చారు. ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న ఝార్సుగుడ జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి అగ్నిమాపక, ఓడ్రాఫ్‌ జవాన్లను తరలించింది. గాలింపు ముమ్మరం చేసినా గల్లంతైన ఏడుగురి ఆచూకీ తెలియలేదు. చీకటి పడడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఒక విమానంలో అయిదుగురు స్కూబా డ్రైవర్లు, సెర్చ్‌లైట్లను ఘటనా స్థలానికి పంపించారు. కడపటి సమాచారం మేరకు గాలింపు కొనసాగుతోంది. దీనిపై సంతాపం తెలిపిన సీఎం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని