logo

మానవత్వం మరణించింది !

వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.

Published : 30 Apr 2024 03:38 IST

రక్తమోడుతున్నా పట్టని చోదకులు
స్నేహితుల యత్నమూ విఫలమై విద్యార్థి మృతి

వెంకటేష్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మిత్రుడు

టంగుటూరు, న్యూస్‌టుడే: వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద సంఘటన టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కొండపికి చెందిన తొర్లికొండ వెంకటేష్‌ (20) టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.  సెమ్‌-2 పరీక్షలు జరుగుతుండటంతో సోమవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్లాడు. అక్కడి 16వ జాతీయ రహదారిపై దిగి నడుచుకుంటూ కళాశాలలోకి వెళ్తుండగా..పాకల నుంచి విద్యార్థులతో వస్తున్న కళాశాల బస్సు ఢీకొంది. దీంతో అతను పక్కనే ఉన్న విభాగినిపై పడిపోవడంతో తలకు గాయమై ముక్కు, చెవి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. వెంకటేష్‌ రక్తమోడుతూ కొట్టుమిట్టాడుతుండగా స్నేహితులు, కళాశాల విద్యార్థులు అక్కడికి పరుగులు తీశారు. జాతీయ రహదారిపై వెళ్లే పలు వాహనదారులను చేతులెత్తి మొక్కి ఆపేందుకు ప్రయత్నం చేయగా, ఒక్క వాహన చోదకుడు కూడా కనికరం చూపకుండా వెళ్లిపోయారు. 108కు  సమాచారమిచ్చినా సరైన సమయానికి చేరుకోలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న ఒంగోలు తాలూకా హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి వాహనంలోనే రిమ్స్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.  ప్రమాదానికి కారణమైన బస్సు చోదకుడిని టంగుటూరు పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని