logo

ఊపిరి ఆగిపోతోందయ్యా!

తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్‌ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు.

Published : 17 May 2024 04:29 IST

మూలకు చేరిన డయాలసిస్‌ యంత్రాలు
ఆసుపత్రిలో నిలిచిన సేవలు
ఆందోళనలో రోగులు

డయాలసిస్‌ చేయించుకునేందుకు వచ్చి నిరీక్షిస్తున్న రోగులు, బంధువులు

కనిగిరి, న్యూస్‌టుడే: తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్‌ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. ఆరుతున్న దీపాలయ్యారు. వారానికి రెండు మూడుసార్లు.. అది కూడా సమయానికి డయాలసిస్‌ చేయించుకుంటేనే ప్రాణం నిలుస్తుంది. లేకుంటే ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో కూడా తెలియని దయనీయ పరిస్థితి. అటువంటి రోగులకు ఠంఛనుగా వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కనీస పర్యవేక్షణ కొరవడింది. కొడిగడుతున్న దీపాల దీన గోడు పాలకులు, అధికారులకు పట్టకుంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వ్యయప్రయాసకోర్చి జిల్లాలు, మండలాలు దాటి వచ్చిన రోగులతో చెలగాటమాడుతున్నారు.

కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రంలో మొత్తం 17 యంత్రాలున్నాయి. ప్రతి రోగికి డయాలసిస్‌ చేసే సమయంలో ఏడు లీటర్ల శుద్ధి జలం అవసరమవుతుంది. ఇందుకుగాను డయాలసిస్‌ కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ పని చేయడం లేదు. ఈ క్రమంలో యంత్రాల్లోకి ఫ్లోరైడ్‌ నీరు చేరింది. నిబంధనల ప్రకారం వీటికి ఏటా మరమ్మతులు అవసరం. అవసరమైతే కొత్త పరికరాలు బిగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సంబంధిత గుత్తేదార్లు విస్మరించారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మరిచారు. దీంతో ఏకంగా 13 యంత్రాలు మూడు రోజుల క్రితం మూలకు చేరాయి. ఈ విషయం బయటికి పొక్కకుండా వైద్యాధికారులు, సిబ్బంది మరో తప్పిదానికి పాల్పడ్డారు. రోజూ షిప్ట్‌ల ప్రకారం 50 మంది రోగులకు డయాలిస్‌ సేవలు అందించాల్సి ఉండగా సగం మందికే చేస్తున్నారు. అది కూడా నాలుగు గంటలపాటు వైద్యం చేయాల్సి ఉండగా.. ఎక్కువ మందికి చేయాలనే తాపత్రయంతో కేవలం రెండు గంటలకే పరిమితం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో చికిత్స అందక రోగులు ఆయాసం, దగ్గుతో తల్లడిల్లుతున్నారు.

మరుగుదొడ్లు.. మందులూ లేవు...

కనిగిరి డయాలసిస్‌ సెంటర్‌లో వైద్యచికిత్సలకు  నెల్లూరు జిల్లా వరికుంటపాడు, వింజమూరు, ఉదయగిరి, లింగసముద్రం, జిల్లాలోని పామూరు, సీఎస్‌పురం, పీసీపల్లి మండలాల నుంచి దాదాపు 120 మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు సేవలు అందించాల్సి ఉంది. గత మూడు రోజులుగా సేవలు సక్రమంగా అందక వీరంతా అవస్థలు పడుతున్నారు. విషయం తెలియక వ్యయప్రయాసకోర్చి వచ్చిన రోగులు, కుటుంబ సభ్యులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండడంతో ఎవరూ వినియోగంచుకోవడం లేదు. కమ్యూనిటీ వైద్యశాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుందామంటే వైద్య సిబ్బంది అడ్డుకుంటున్నారు. దీంతోపాటు మందులు ఇవ్వడం లేదు. ఐరన్‌ ఇంజెక్షన్‌ కూడా రోగులే బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ఈ విషయమై కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్‌ డా. అబ్దుల్‌ కలాం మాట్లాడుతూ.. కొన్ని యంత్రాలకు మరమ్మతులు చేయించామని.. మిగిలిన వాటినీ అందుబాటులోకి తెచ్చి రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు.


నా పేరు వీరపనేని చెన్నయ్య. మాది సీఎస్‌పురం మండలం పెదగోగులపల్లి. ఉదయం 5 గంటలకు డయాలసిస్‌ చేయించుకునేందుకు వచ్చా. యంత్రాలు పని చేయడం లేదని చెప్పడంతో చేసేదేమీ బయట కూర్చుని నిరీక్షిస్తున్నాం. మూత్రశాలలు లేవు. పక్కనే ఉన్న కమ్యూనిటీ వైద్యశాలలోకి వెళ్తుంటే.. డయాలసిస్‌ రోగులు ఇక్కడికి రావొద్దంటూ సిబ్బంది అడ్డుకుంటున్నారు.  


మాది పామూరు. నా పేరు సుబ్బమ్మ. వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. ఇక్కడికి వస్తే యంత్రాలు పని చేయడం లేదు వేచి ఉండాలని సిబ్బంది చెప్పారు. నాలుగు గంటలపాటు వేచి ఉన్నా చేయలేదు. ఆయాసంగా ఉంది. త్వరగా డయాలసిస్‌ చేస్తేనే నేను బతుకుతాను.


పామూరు మండలం వీరభద్రాపురం మాది. పేరు చీమలదిన్నె నాగార్జున. ఉదయం 5 గంటలకు డయాలిస్‌కు వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలైనా చెయ్యలేదు. వారానికి మూడు సార్లు డయాలసిస్‌ అవసరం. సమాయానికి చేస్తేనే ఉపశమనం. ఇక్కడేమో యంత్రాలు పని చేయడం లేదు.. మరోసారి రమ్మని చెబుతున్నారు. ఇలా అయితే మా ప్రాణాలు నిలిచేది ఎలా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు