గత్యంతరం లేకే ఉద్యమ కార్యాచరణ
ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు
మాట్లాడుతున్న శ్రీనివాసరావు, చిత్రంలో ఇతర నాయకులు
పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: పీఆర్‌సీతో పాటు వివిధ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు.. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నేను ఉద్యోగుల పక్షపాతిని.. ఏ రాజకీయ పార్టీకీ తొత్తును కాదు.. రెండేళ్లు దాటినా పీఆర్‌సీ అమలు కాలేదు.. కనీసం నివేదిక అడుగుతున్నా ఇవ్వట్లేదు. రూ.16 వేల కోట్ల ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదు. మేము ఉద్యమం వైపు వెళ్లకుండా ముఖ్యమంత్రే చర్యలు తీసుకోవాలి.’ అని అన్నారు. సమావేశంలో అమరావతి ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు ఫణి పేర్రాజు, ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.భానుమూర్తి, జిల్లా ఐకాస ఛైర్మన్ హనుమంతు సాయిరాంతో పాటు వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.