logo

నైపుణ్యం సాధిద్దాం.. కొలువు పట్టేద్దాం..

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా పొందాలంటే కళాశాలలో చేరిన నాటినుంచే తగిన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. అందులో భాగంగా ప్రభుత్వం 2015లో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది.

Published : 07 Dec 2021 06:07 IST


శిక్షణ పొందుతున్న విద్యార్థులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా పొందాలంటే కళాశాలలో చేరిన నాటినుంచే తగిన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. అందులో భాగంగా ప్రభుత్వం 2015లో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీనిద్వారా విద్యార్థులకు కళాశాల స్థాయి నుంచే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలపై శిక్షణ అందిస్తోంది. ఆంగ్లం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలతో పాటు అకడమిక్‌ సబ్జెక్టులకు సమాంతరంగా అదనపు సాఫ్ట్‌వేర్‌ కోర్సులపై తర్ఫీదు ఇస్తున్నారు. వివిధ బహుళజాతి సంస్థలు నిర్వహించే ఉద్యోగ ఎంపికలకు హాజరయ్యేలా సహకారం అందిస్తున్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో శిక్షణ పొంది పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఉజ్వల భవితకు బాటలు వేసుకుంటున్నారు. వీరిలో పురుషులకు సమానంగా మహిళలు ఉండటం విశేషం.

ప్రణాళికతో సాధన చేస్తే చాలు... డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం. ఈ మేరకు కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇంటర్వ్యూలకు ఏ విధంగా హాజరవ్వాలనేది ప్రయోగపూర్వకంగా తెలియజేస్తూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నాం.

- డా.ఎన్‌.గోవిందరావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి


డిగ్రీతోనే ఉద్యోగం...

డిగ్రీ మూడేళ్ల కాలంలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, కంప్యూటర్‌ లాంగ్వేజ్‌, అదనపు సాఫ్ట్‌వేర్‌ కోర్సులు పూర్తిచేశాను. ఏపీఎస్‌ఎస్‌డీసీ అందించిన శిక్షణ ఉపయోగపడింది. ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలకు హాజరై మూడు కంపెనీలకు ఎంపికయ్యాను. ఇన్ఫోసిస్‌లో చేరతాను. శిక్షణలో రూ.2.20 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఈ ఏడాది బీఎస్సీ పూర్తయింది. మా నాన్న మెకానిక్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి.

- అమాలపురపు దీపిక, శ్రీకాకుళం


రూ.2.20 లక్షల వేతనం...

నేను ఈ ఏడాది బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాను. రూ.2.20 లక్షల వార్షిక ప్యాకేజీ వస్తుంది. శిక్షణ అనంతరం వేతనం పెరుగుతుంది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ఏపీఎస్‌ఎస్‌డీసీ అందిస్తోన్న శిక్షణలకు హాజరయ్యాను. ఆంగ్లంతో పాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకున్నాను. దీంతో ఇంటర్య్యూను ధైర్యంగా ఎదుర్కొన్నాను.

- కోరాడ ప్రియాంక, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని