logo

విదేశీ పిక్కలపైనే ఆధారం

జిల్లాలో తెల్ల బంగారంగా పేరొందిన జీడిపప్పునకు పలాస ప్రాంతం గుర్తింపు పొందింది. 70 ఏళ్లుగా ఇక్కడి నుంచి జీడిపప్పు ఉత్పత్తులు జరుగుతున్నాయి.

Published : 28 Nov 2022 04:10 IST

తగ్గుతున్న జీడి వ్యాపారం

విదేశీ జీడిపిక్కలను దించుతున్న హమాలీలు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: జిల్లాలో తెల్ల బంగారంగా పేరొందిన జీడిపప్పునకు పలాస ప్రాంతం గుర్తింపు పొందింది. 70 ఏళ్లుగా ఇక్కడి నుంచి జీడిపప్పు ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఏటా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలుంటాయి. ముడిసరకు చాలనందున 70 శాతం మేరకు ఇతర దేశాల నుంచి పిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. నాణ్యత విషయంలో విదేశీ పిక్కలు తేడా ఉండడం, ఇతర కారణాలతో అందుకు తగ్గ వ్యాపారం జరగడం లేదని వ్యాపారులంటున్నారు.

జోరుగా దిగుమతి: జిల్లాలో సుమారు 300 జీడిపప్పు కర్మాగారాలున్నాయి. అందులో పలాస-కాశీబుగ్గ ప్రాంతంలో 250 వరకు ఉన్నాయి. ఏటా 240 నుంచి 250 పని దినాలుంటాయి. రోజుకు 60 నుంచి 70 టన్నుల వరకు జీడి పప్పు ఉత్పత్తి అవుతుంది. అందుకు తగ్గట్టుగా పిక్కలు మాత్రం లభ్యం కావడం లేదు. దీంతో ఐవేరీకోస్ట్‌, టాంజానియా, జాంబియా, ఘనా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

తగ్గిన ధరలు: విదేశీ పిక్కలు ధర తగ్గడంతో దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. విదేశీ పిక్కల ధర ఏప్రిల్‌ నాటికి బస్తా రూ.10 వేలు వరకు ఉండేది. ప్రస్తుతం 80 కిలోల బస్తాకు 22 కిలోలు పప్పు దిగుబడి అయితే రూ.8,800, 24 కిలోలు దిగుబడికి రూ.9600 వరకు ధర ఉంది. స్థానిక పిక్కలు ధర ప్రారంభంలో రూ.11 వేలు ఉండగా ప్రస్తుతం రూ.10 వేలుంది. తక్కువ ధరకు వస్తుండడంతో వ్యాపారులు విదేశీ పిక్కలపైనే ఆసక్తి చూపుతున్నారు.

బేజారు: జీడిపప్పు డిమాండ్‌ మార్కెట్‌లో తగ్గిపోయింది. ఎగుమతులు మందగించడం దీనికొక కారణం. ఈ నేపథ్యంలో పప్పు ధరలు కిలోకు రూ.20 నుంచి రూ.50 వరకు తగ్గాయి. ఏటా దీపావళికి పప్పు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. ఈ ఏడాది ఆశించిన మేరకు ఎగుమతులు కూడా జరగడం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎగుమతులు తగ్గాయి: కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న పప్పు గతంలో ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేది. ఆర్థికమాంద్యం కారణంగా రెండేళ్ల నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తవుతున్న పప్పు సైతం భారత దేశంలోనే విక్రయిస్తున్నారు. ఆ ప్రభావం ఈ ప్రాంత పప్పు ఉత్పత్తులపై పడుతోంది. వియత్నాం వంటి దేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి అవుతోంది. దీనిపై ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఫిర్యాదు చేశారు.

ఎం.సురేష్‌కుమార్‌, అధ్యక్షుడు, పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని